మణిరత్నం మరో సంచలనానికి తెరలేపుతున్నారు. ఫస్ట్ టైమ్‌ ఆయన ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. ఊహించని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఓ విభిన్నమైన ప్రయోగాత్మక వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. దీనికి తొమ్మిది మంది దర్శకులు దర్శకత్వం వహించగా, తొమ్మిది ఎపిసోడ్లుగా ఇది ప్రసారం కానుంది. దీనికి నెట్‌ ఫ్లిక్స్ వేదిక కాబోతుంది. 

ఇక తొమ్మిది ఎపిసోడ్లకి కేవీ ఆనంద్‌, గౌతమ్‌ మీనన్‌, బిజోయ్‌ నంబియార్‌, కార్తీక్‌ సుబ్బరాజు, పొన్‌ రామ్‌, హలిత షలీమ్‌, కార్తీక్‌ నరేన్‌, రతీంద్రన్‌ ప్రసాద్‌, అరవింద్‌ స్వామిలు  దర్శకత్వం వహించనున్నారు. వీరందరినీ మణిరత్నం పర్యవేక్షణలో జరుగుతుంది. దీన్ని మణిరత్నం, జయేంద్రలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఓ సినిమా రేంజ్‌లో దీన్ని నిర్మించబోతుండటం విశేషం. 

భారీ తారాగణంతో ఈ వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించబోతున్నారు. దాదాపు ఇరవై మంది స్టార్‌ హీరోలు నటించనున్నట్టు తెలుస్తుంది. సూర్య, విజయ్ సేతుపతి, అరవింద్‌ స్వామి, సిద్ధార్థ్‌, ప్రకాష్‌ రాజ్‌, శరవణన్‌, అలగమ్‌ పెరుమాల్‌, ప్రసన్న, విక్రాంత్‌, సింహా, గౌతమ్‌ కార్తీక్‌, అశోక్‌ సెల్వన్‌, రోబో శంకర్‌, రమేష్‌ తిలక్‌, సనంత్‌, శ్రీరామ్‌, రేవతి, నిత్యా మీనన్‌, ఐశ్వర్యా రాజేష్‌, పార్వతి, పూర్ణ, రిత్విక నటీనటులుగా నటించనున్నారు. దీనికి 'నవరస' అనే టైటిల్‌ని ఖరారు చేయబోతున్నారట. నవరస మాదిరిగానే నవరసాలతో ఈ వెబ్‌ సిరీస్‌ సాగుతుందట. ఒక్కో రసంతో ఒక్కో ఎపిసోడ్‌ ఉంటుందని తెలుస్తుంది.

తొమ్మిది దర్శకులు, తొమ్మిది ఎపిసోడ్స్ మాదిరిగానే తొమ్మిది మంది సంగీత దర్శకులు, తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు పనిచేస్తున్నారట. సంగీత దర్శకుల్లో ఏ.ఆర్‌.రెహ్మాన్‌, డి.ఇమ్మాన్‌, జిబ్రాన్‌, కార్తీక్‌, గోవింద్‌ వసంత వంటి వారున్నారు. ప్రస్తుతం మణితర్నం `పొన్నియిన్‌ సెల్వన్‌` అనే హిస్టారికల్‌ చిత్రాన్ని భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్‌ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తిరిగి షూటింగ్‌ ప్రారంభించే లోపు ఈ వెబ్‌ సిరీస్‌ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.