నటీనటులు: కంగనా రనౌత్, అంకితా లోఖండే, అతుల్ కులకర్ణి, జిషు సేన్ గుప్తా తదితరులు 
సంగీతం: శంకర్-ఇసాన్-లాయ్ 
సినిమాటోగ్రఫీ: కిరణ్‌ డియోహన్స్‌, జ్ఞానశేఖర్‌. వి.ఎస్‌
ఎడిటింగ్‌: రామేశ్వర్‌ భగత్‌, సూరజ్‌ జగ్తప్‌
కథ: విజయేంద్ర ప్రసాద్
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి, కంగనా రనౌత్‌

చరిత్రను వక్రీకరిస్తూ.. 'మణికర్ణిక' సినిమాను రూపొందిస్తున్నారంటూ మొదట నుండి వివాదాలు వస్తూనే ఉన్నాయి. సినిమా విడుదల కాకుండా చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు 'మణికర్ణిక' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించే కంగనా మరో పవర్ ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనుకుంది. మరి ఈ సినిమా ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
బెనారస్ లో పుట్టిపెరిగిన మణికర్ణిక(కంగనా రనౌత్)కి ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్ రావు(జిషు సేన్ గుప్తా)తో వివాహం జరుగుతుంది. అలా భర్తతో కలిసి ఝాన్సీ రాజ్యానికి వెళ్లిన మణికర్ణిక పేరుని లక్ష్మీబాయిగా మారుస్తారు. ఝాన్సీ ప్రజలతో మమేకమై ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమె ధైర్యసాహసాలు చూసిన ఝాన్సీ రాజ్యం సరైన 
రాణి దొరికిందంటూ ప్రశంసిస్తుంటుంది.

ఇది ఇలా ఉండగా.. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపనీ ప్రతినిధులు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఝాన్సీ రాజ్యాన్ని వశం చేసుకోవడానికి కొందరు బ్రిటీష్ ప్రతినిధులు ఎత్తులు వేస్తుంటారు. వాటిని ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఎదుర్కొంది..?  స్వాతంత్య్రం కోసం ఆమె ఎలా పోరాడింది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో సినిమాను మొదలుపెట్టారు. ఆయన మాటల్లో బ్రిటీష్ పాలకులు రాకముందు భారతదేశం ఎలా ఉండేదో వివరిస్తూ.. కథను మొదలుపెట్టారు. సినిమా మొదటిభాగం మొత్తం మణికర్ణిక చిన్నతనం, ఆమె ఎదిగిన విధానం, ఆమె కనబరిచిన ధైర్యసాహసాలను చూపించారు. మణికర్ణిక వివాహం తరువాత అసలు కథ మొదలవుతుంది. 

ఝాన్సీ రాజ్యంలో ఆమె జీవితం, ఝాన్సీని దక్కించుకోవడానికి వచ్చిన బ్రిటీష్ పాలకులను ఎదిరించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యుద్ధ పోరాట సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం గురించి తెలియని కొన్ని సన్నివేశాలను సైతం ఈ సినిమాలో చూపించారు. ఝాన్సీ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీరట్ సిపాయి తిరుగుబాటు వంటి అంశాలను కథకు జోడించారు.

సినిమాలో సంభాషణలు, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ అవసరం లేకపోయినా పెట్టారు. యుద్ధ సన్నివేశాల కోసం అప్పటికాలం నాటి ఆయుధాలను  వినియోగించారు. సహజంగా కనిపించడం కోసం వారు చేసిన ప్రయత్నం వర్కవుట్ అయింది. అయితే యుద్ధ సన్నివేశాలు చాలా చోట్ల రిపీట్ మోడ్ లో చూపించారు. ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా అధ్బుతంగా నటించింది.

పాత్రలో ఉన్న వేరియేషన్స్ ని తెరపై బాగా పండించింది. కంగనా కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. జిషు సేన్ గుప్తా, అంకితా లోఖండే, డానీ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. విజేయంద్రప్రసాద్ అందించిన కథను దర్శకుడిగా క్రిష్ బాగానే డీల్ చేశాడు. చాలా చోట్ల ఆయన మార్క్ డైరెక్టర్ కనిపిస్తుంటుంది. 

ఇటువంటి కథలకు పాటలు లేకపోతేనే బాగుంటుంది. సినిమాకు సంగీతంతో పెద్దగా కలిసోచ్చిందేమీ లేదు. నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ చూపించాల్సివుంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్లుగా ఉన్నాయి. 

రేటింగ్: 3/5

'మణికర్ణిక' ట్విట్టర్ రివ్యూ!