Asianet News TeluguAsianet News Telugu

వాళ్లంతా మంచి నటులే కానీ, ‘‘మా’’లో పనిచేసే సత్తా లేదు: ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై విష్ణు కామెంట్స్

ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారని.. వారిలో కొందరు నా బ్యానర్‌లోనూ పనిచేశారని.. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటానని విష్ణు చెప్పారు. కానీ మా అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదని.. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరని ఆయన స్పష్టం చేశారు.

manchu vishnu press meet about maa elections
Author
Hyderabad, First Published Sep 24, 2021, 5:37 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా ’’ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ హీరో మంచు విష్ణు తన మేనిఫెస్టోను ప్రకటించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన అయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ పాలసీపై చర్చకు సిద్ధమన్నారు. పరిశ్రమలో కొత్తవారికి అవకాశాలు రావాలని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. మా ప్యానెల్ మరో ప్రయారిటీ విద్య అని విష్ణు చెప్పారు. ‘‘ మా ’’లో సభ్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం వుందని ఆయన గుర్తుచేశారు. 

సినీ కార్మికులకు మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని విష్ణు హామీ ఇచ్చారు. మా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత పోటీ లేదని ఆయన అన్నారు. ‘‘ మా ’’లో మార్పు తీసుకొస్తానని విష్ణు తెలిపారు. సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయని.. కానీ కళాకారులు మాత్రం మారలేదని ఆయన చెప్పారు. రేషన్ ఇన్స్‌పెక్టర్‌గా వున్న బాబూ మోహన్ ప్యాషన్‌తో సినిమాల్లోకి వచ్చారని.. ఆయన అనుభవం, వయసు తనకు కావాలని విష్ణు తెలిపారు. 

‘‘మా’ పుట్టి 25 సంవత్సరాలు అయిందని.. చాలా మంది కళాకారులకు తమిళనాడు/ చెన్నై అన్నం పెట్టింది. ఇప్పటికీ పెడుతూనే ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా తెలుగు నటులకు ఒక సంఘం ఉండాలని ‘మా’ను ఏర్పాటు చేశారు. ఎంతోమంది అతిరథ మహారథులు తెలుగు సినిమా కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డారని విష్ణు వెల్లడించారు. తెరపై చూసినట్లు సినిమా నటులు ఖరీదైన జీవితాలను గడుపుతారని చాలా మంది అనుకుంటారని.. కానీ, మేకప్‌ తీసి ఇంటికి వచ్చిన తర్వాత మేమూ మీలాగే జీవిస్తామన్నారు. 

ఒక నటుడికి ఈ ఏడాది మొత్తం పని ఉండొచ్చు... వచ్చే ఏడాది కనీసం మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి ఏర్పడొచ్చని, నటుడి కష్టాలు, ఆవేదన అతడికే తెలుస్తుందని విష్ణు పేర్కొన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా తెలియదని.. ఆ బాధ ఎవరితోనూ పంచుకోలేమని.. ఆర్టిస్ట్‌ల కోసం, మా అందరి కోసం ‘మా’ ఉందన్నారు. ‌మా ప్రెసిడెంట్‌ అనేది ఒక బిరుదు కాదు.. బాధ్యత అని.. దాన్ని నేను సమర్థంగా తీసుకోగలననే నమ్మకంతో వస్తున్నానని విష్ణు వెల్లడించారు. 

2015-16లో దాసరి నారాయణరావు, మురళీమోహన్‌ తనను ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమన్నారు. ఇదే విషయాన్ని నాన్న దగ్గర ప్రస్తావిస్తే, ‘ఆ పదవి బాధ్యతతో కూడుకున్నదని.. అనుభవం సరిపోదని, నీ చేతుల్లో వరుస సినిమాలు ఉన్నాయని నువ్వు సమయాన్ని కేటాయించలేవు అన్నారని విష్ణు గుర్తుచేశారు. మార్పు తీసుకురాగలననే ధైర్యంతో ఇప్పుడు వస్తున్నానని.. ‘మా’లో ఎన్నో సవాళ్లు ఉన్నాయని.. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్‌కు ఉందని  ఆయన స్పష్టం చేశారు. 

ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారని.. వారిలో కొందరు నా బ్యానర్‌లోనూ పనిచేశారని.. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటానని విష్ణు చెప్పారు. కానీ మా అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదని.. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరని దీన్ని ఎక్కడైనా చెబుతానన్నారు. వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసునని.. వాళ్ల ప్రసంగాలు విన్నానని, వారు చెప్పింది 99 శాతం తాను ఆమోదించనని స్పష్టం చేశారు. తినడానికే సగం మందికి తిండి లేదని.. రెస్టారెంట్‌కు డిస్కౌంట్‌లో ఎలా తినగలుగుతారని ఆయన ప్రశ్నించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios