‘కన్నప్ప’ షూటింగ్ లో మంచు విష్ణుకు గాయాలు.. ఎలా జరిగింది? ఇప్పుడు టీమ్ ఎక్కడుంది?
హీరో మంచు విష్ణు ప్రమాదానికి గురయ్యారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ లో పాల్గొన్న ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో చిత్రీకరణను ఆపేశారు.
హీరో మంచు విష్ణు (Manchu Vishnu) తన కలల ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టులోనే ఈ పాన్ ఇండియా మూవీ శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా షురూ అయ్యింది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో భారీ కాస్ట్ ను ఎంపిక చేశారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. రీసెంట్ గానే చిత్ర యూనిట్ న్యూజిలాండ్ కు ఎనిమిది భారీ కంటైనర్లను తరలించారు. అక్కడ ఓ భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేయబోతున్నారని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను విష్ణుపై షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణుమీదకి దూసుకొచ్చిందని తెలుస్తోంది. దీంతో తీవ్రమైన ప్రమాదం జరగకపోయినా.. విష్ణు చేతికి బలమైన గాయాలయ్యాయని సమాచారం.
దీంతో వెంటనే విష్ణును యూనిట్ ఆస్ప్రత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విష్ణు గాయాలపాలవడం, వైద్యులు కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని అనడంతో చిత్రబృందం చిత్రీకరణను నిలిపివేసిట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో మంచు విష్ణు అభిమానులు ఆందోళన పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికన కోరుకుంటున్నారు.
ఇక ‘కన్నప్ప’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో అవా ఎంటర్ టైన్ మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై పాన్ ఇండియా ఫిల్మ్ గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. మహాభారత సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. చిత్రంలో నయనతార, అనుష్క కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ కు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.