66వ జాతీయ చలన చిత్ర అవార్డులని శుక్రవారం రోజు ప్రకటించారు. తెలుగు సినిమాలు మహానటి, రంగస్థలం, చిలసౌ, అ ! చిత్రాలకు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకోవడంతో ఆమె పేరు మారుమోగుతోంది. విజయశాంతి కర్తవ్యం చిత్రం తర్వాత ఓ తెలుగు చిత్రానికి ఉత్తమ నటి విభాగంలో అవార్డు రావడం ఇదే తొలిసారి. 

ఉత్తమ జాతీయ నటులుగా అంధాధూన్ చిత్రానికి ఆయుష్మాన్ ఖురానా, ఉరి చిత్రానికి విక్కీ కౌశల్ కు అవార్డు దక్కింది. కానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అర్హుడనే వాయిస్ అంతకంతకు పెరుగుతోంది. రంగస్థలం చిత్రానికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో జాతీయ అవార్డు ఇచ్చి సరిపుచ్చారు. 

రాంచరణ్ ఉత్తమ నటుడిగా అన్ని విధాలా అర్హుడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

మంచు విష్ణు ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ.. 'జాతీయ అవార్డులు గెలుచున్న వారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. కానీ సోదరుడు రాంచరణ్ రంగస్థలం చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా అన్ని విధాలా అర్హుడు. నా అభిప్రాయాన్ని నిజాయతీగా చెబుతున్నా.. రాంచరణ్ రంగస్థలంలో ఉత్తమ నటన కనబరిచాడు. ఇటీవల కాలంలో అలాంటి నటనని మరే నటుడిలోనూ చూడలేదు. రంగస్థలం చిత్రంపై ప్రేక్షకులు ప్రేమ చూపించి ఆల్రెడీ రాంచరణ్ కు అవార్డు ఇచ్చేశారు' అని విష్ణు ట్వీట్ చేశాడు.