మంచు కుటుంబం మరో కొత్త చిత్ర ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా హింట్ ఇచ్చారు. తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కి పనిచేయనున్న టీమ్ ని పరిచయం చేశారు. దీనికి సంబంధించిన వీడియో మంచు విష్ణు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.

నటుడుగా మోహబాబు (Mohan babu)టాలీవుడ్ లో హైట్స్ చూశారు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణ పాత్రలు చేశారు. 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. అలాంటి మోహన్ బాబును ఈ తరం మర్చిపోయింది. ఆయన నుండి చిత్రం అంటే కనీస ఆదరణ కరువవుతోంది. ఏ నటుడికైనా ఇది ఎదురయ్యే పరిస్థితే. ఎంత పెద్ద హీరోకైనా ఒక దశ వచ్చాక మార్కెట్ ఉండదు. మోహన్ బాబు లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా ఘోర పరాభవం చూసింది. 

సన్ ఆఫ్ ఇండియా (Son Of India)చిత్రాన్ని కొనేవారు లేక సొంతగా నిర్మించడంతో పాటు విడుదల కూడా చేసుకున్నారు. మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి పోస్టర్స్ ఖర్చులు కూడా వసూలు కాలేదు. మోహన్ బాబు అంటే ఈ తరం నటుడు కాదు కాబట్టి ప్రేక్షకులు పట్టించుకోవడం లేదంటే అర్థం ఉంది. ఆయన ఇద్దరు కుమారుల సినిమాల పరిస్థితి కూడా ఇదే. ప్రయత్న లోపం లేకుండా చేస్తున్న ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. 

View post on Instagram

మంచు విష్ణు (Manchu Vishnu)సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో మోసగాళ్లు మూవీ చేశారు. కాజల్, సునీల్ శెట్టి వంటి స్టార్ క్యాస్ట్ ని ఎంచుకున్నారు. మోసగాళ్లు ఓ చిన్న సినిమా వసూళ్లు కూడా పొందలేదు. ఈ సినిమా నిర్మాత మంచు విష్ణు కాగా.. ఆయనకు కోట్లలో నష్టాలు మిగిల్చింది మోసగాళ్లు. మరో మంచు హీరో మనోజ్ కూడా హిట్ కొట్టి ఏళ్ళు గడిచి పోతుంది. ఆయన అహం బ్రహ్మస్మి పేరు ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుందని సమాచారం. 

మరి సినిమాను నమ్ముకున్న ఫ్యామిలీగా ఎన్ని పరాభవాలు ఎదురవుతున్నా మంచువారు తగ్గడం లేదు. మరోకొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. మంచువారి కుటుంబం నిర్మించనున్న కొత్త చిత్రానికి కోనా వెంకట్, అనూప్ రూబెన్స్, చోటా కె నాయుడు పనిచేస్తున్నారు. ఇక సూర్య అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.సినిమా ఎవరితో? జోనర్ ఏమిటీ? మిగతా నటీనటులు ఎవరు? అనే విషయాలు వెల్లడించలేదు. త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. 

మంచు విష్ణు పోస్ట్ చేసిన వీడియోలో మోహన్ బాబు సైతం ఉన్నారు. మెగా ఫ్యామిలీ తో మోహన్ బాబు కుటుంబానికి ఇగో వార్ నడుస్తుంది. ఎట్టాగైనా హిట్ కొట్టి పరిశ్రమలో కమ్ బ్యాక్ కావాలని మంచు ఫ్యామిలీ కోరుకుంటున్నారు. దానికి కోసం ఈ ప్రయత్నాలు. ఒకప్పుడు మంచు విష్ణుకు ఎంతో కొంత మార్కెట్ ఉండేది. వరుస పరాజయాలతో ఆయన సినిమాలకు ఆదరణ తగ్గింది. మరోవైపు మంచు కుటుంబంపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ కి మోహన్ బాబు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సదరు ట్రోలర్స్ వీడియోలు తొలగించకపోతే పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు.