మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏడాది పూర్తి చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 13న విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏడాది పూర్తి చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 13న విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాను అధ్యక్షుడిగా 90 శాతం హామీలు నెరవేర్చినట్లు విష్ణు ప్రకటించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ మీడియా సమావేశంలో విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. నేను మా అసోసియేషన్ కి మాత్రమే కాదు తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ జవాబుదారీని అని విష్ణు పేర్కొన్నారు. నేను అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించినప్పుడు చిత్ర పరిశ్రమలో ఎంతో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. 

మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలని తలపించాయి. ప్రస్తుతం మా అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కానివారు సభ్యులుగా ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చాలనుకుంటున్నా. మా సభ్యత్వంలో కఠినమైన నిబంధనలు తీసుకువస్తాం. ఇప్పటికే నిర్మాతలకు కొన్ని ప్రతిపాదనలు చేశాం. మా లో సభ్యత్వం ఉన్నవారినే నిర్మాతలు తమ చిత్రాలకు తీసుకోవాలి. 

మాలో శాశ్వత సభ్యత్వం ఉండాలంటే కనీసం రెండు చిత్రాల్లో అయినా నటించి ఉండాలి. కనీసం ఐదు నిమిషాల పాత్రలో నటించి డైలాగ్స్ చెప్పి ఉండాలి. మాలో అసోసియేట్ సభ్యులు కూడా ఉంటారు. కానీ వారికీ ఓటు వేసే హక్కు ఉండదు. ఐదేళ్ల పాటు మాలో శాశ్వత సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. 

మా అసోసియేషన్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేసినా, పోస్ట్ లు పెట్టినా సభ్యత్వం శాశ్వతంగా తొలగిస్తాం. మా అసోసియేషన్ భవనం నిర్మించేందుకు సభ్యులు రెండు ప్రతిపాదనలు సూచించారు. ఫిలిం నగర్ కి అరగంట దూరంలో ఓ భవనం నిర్మించడం.. ఫిలిం ఛాంబర్ కూల్చేసి కొత్తది నిర్మించడం.. రెండవ దానికే సభ్యులు ఆమోదం తెలిపారు. ఫిలిం ఛాంబర్ కూల్చేసి సొంత ఖర్చులతో కొత్త బిల్డింగ్ కట్టిస్తా అని మంచు విష్ణు హామీ ఇచ్చారు. మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.