నటిగా ఎన్నో సినిమాలు చేసిన మంచు లక్ష్మీ ఆ తరువాత హోస్ట్ గా బుల్లితెరపై కొన్ని షోలు చేసింది. తాజాగా మరో షోని హోస్ట్ చేయడానికి సిద్ధమైంది. అదే 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్'. త్వరలోనే ఈ షో టెలికాస్ట్ కానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.

ఇప్పటివరకు తను చేసిన షోలలో 'ఫీట్ అప్ విత్ ది  స్టార్స్' భిన్నమైందని.. ఈ షో కోసం స్టార్స్ ని కలిసినప్పుడు నైట్ డ్రెస్ రావాలని చెబితే కొందరు ఆశ్చర్యపోయారని.. కొందరు ఉత్సాహం చూపించారని చెప్పింది. బాలీవుడ్ లో ఇలాంటి షోలు సాధారణమేనని ఈ షోకి హోస్ట్ గా తనను ఎన్నుకున్నారంటే ఎంతో బాధ్యతతో చేయగలననే నమ్మకమేనని చెప్పుకొచ్చింది.

ఇది రియాలిటీ షో కాదని.. చక్కని ఫన్ గేమ్ లాంటిదని చెప్పింది. ఈ షోని ముందుగా తనకు తెలిసిన సెలబ్రిటీలతో మొదలుపెట్టినట్లు.. అందరినీ ఈ షోలో కలుసుకోవాలనుందని  చెప్పింది. ప్రత్యేకంగా ఎవరినీ ఇష్టం అని చెప్పలేను కానీ రానాని బాగా మిస్ అవుతున్నట్లు చెప్పింది. వెబ్ సిరీస్ లో ఎక్కువగా చూస్తుంటాను కానీ బుల్లితెరపై జరుగుతున్న రియాలిటీ షోలు మాత్రం చూడనని  వెల్లడించింది.