నటుడు రాఘవ లారెన్స్ పేరుతో మెడికల్ సీట్ ఇప్పిస్తామని రూ.18 లక్షలకు ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల కోసం ట్రస్ట్ ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లారెన్స్ ట్రస్ట్ లో పని చేస్తున్నానని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక మెడికల్ స్టూడెంట్ కి తక్కువ ఖర్చుతో సీట్ ఇప్పిస్తామని రూ.18 లక్షలు వసూలు చేశాడు.

రామనాథపురం, చిన్నకడై వీధికి చెందిన అల్‌అమీన్‌,అతడి భార్య పత్తూర్ నిషా. వీరి కూతురు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో నీట్‌ పరీక్ష రాసింది. ఆమెకి తక్కువ మార్కులు వచ్చాయి. ఆ సమయంలో ఓ ట్రావెల్ షాప్ లో పత్తూర్ నిషాకి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయమైంది. 

ప్రవీణ్ కుమార్ తను నటుడు రాఘవ లారెన్స్‌ నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు ఉపాధ్యక్షుడినని చెప్పాడు. ఆ ట్రస్ట్ ద్వారా మీ అమ్మాయికి వూలూర్‌లోని వైద్య కళాశాలలో సీట్ ఇప్పిస్తామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన పత్తూర్ నిషా.. ప్రవీణ్ కుమార్ అకౌంట్ కి ముందుగా.. రూ.4.5 లక్షలు పంపింది. ఆ తరువాత హాస్టల్ ఫీజ్, ఇతర ఖర్చు అంటూ మరికొంత  డబ్బుని పంపించారు.

అలా మొత్తం పత్తూర్‌ నిషా నుంచి రూ.18 లక్షలు వసూలు చేసిన ప్రవీణ్‌కుమార్‌ ఆమె కూతురికి మెడికల్‌ సీటు ఇప్పించలేదు. దీంతో అనుమానం వచ్చిన పత్తూర్ నిషా.. రాఘవ లారెన్స్ ట్రస్ట్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆరా తీయగా.. అసలు విషయం తెలుసుకుంది. తను మోసపోయానని గ్రహించి భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు.