బాలీవుడ్ స్టార్, ‘ఆర్ఆర్ఆర్’ నటుడు అయిన అజయ్ దేవగన్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని గోరేగావ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి అడ్డగించి నానా హంగామా చేయటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సదరు వ్యక్తి..అజయ్ దేవగన్ ని పట్టుకుని రైతుల ఉద్యమానికి ఎందుకు మద్దతు తెలపడం లేదని నిలదీశాడు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని రోడ్డు మీదే డిమాండ్ చేశాడు. దాంతో వేరే దారిలేక పోలీస్ లు అతన్ని అరెస్ట్ చేసారు.

వివరాల్లోకి వెళితే...కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీల్లో రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న విషయం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.ఇంకాస్త దూకుడు పెంచి ఎర్రకోట ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఇంత పెద్ద ఉద్యమం నడుస్తున్నా సెలెబ్రెటీలు ఏమాత్రం స్పందించకపోవడం పెద్ద దుమారాన్నే రేపింది. అయితే దీనిపై సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు స్పందించిన తీరు పెద్ద వివాదాస్పదమైంది.అయితే రైతుల ఉద్యమం మీద బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.

అజయ్ దేవగన్ ఏమన్నారంటే భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని, దయచేసి అటువంటి వారి వలలో రైతులు పడవద్దని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడంతో రైతులు అజయ్ దేవగన్ మీద అగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు అజయ్ దేవగన్ కారు ని ఆపి ఇక చట్టాల వల్ల రైతులు ఎంతలా నష్టపోతున్నారో మీకు తెలియదని చాలా ఆగ్రహంతో ఆ వ్యక్తి ఊగిపోయారు.కారులోనుండే అతనికి నమస్కరిస్తూ తప్పుకోమని చెప్పినా ఆ వ్యక్తి వినలేదు.

అజయ్ దేవగన్ చుట్టూ బాడీ గార్డులు ఉన్నా మాత్రం భయపడలేదు ఆ వ్యక్తి. రైతుల ఉద్యమం విషయంలో సెలబ్రిటీల మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఉద్యమకారులు. ఇలాంటి టైంలో అతని మీద దురుసుగా ప్రవర్తిస్తే అనవసర వివాదాలకు కారణమవుతుందని భావించిన అజయ్ సెక్యూరిటీ మాటలతో నిలువరించే ప్రయత్నం చేసి సాధ్యంకాక పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లలో కూడ మిశ్రమ స్పందన కనబడుతోంది. కొందరైతే గతంలో అజయ్ దేవగన్ ప్రభుత్వానికి అనుకూలంగా చేసియన ట్వీట్లను గుర్తు చేశారు.