కేరళ నటి మంజు సవార్కర్ అర్ధరాత్రి హోటల్ సిబ్బందితో గొడవకి దిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని శాంత పరిచారు. అసలు విషయంలోకి వస్తే.. నాగర్ కోయిల్ పరిసర ప్రాంతాల్లో ఓ మలయాళ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

నటి మంజు సవార్కర్ తో పాటు యూనిట్ సభ్యులందరూ నాగర్ కోయిల్ లో ఓ లాడ్జిలో బస చేస్తున్నారు. బుధవారం రాత్రి  షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన యూనిట్ సభ్యులు వారి వారి గదుల్లోకి వెళ్లిపోయారు. తన గదిలోకి వెళ్లిన మంజు మంచంపై దుప్పట్లను హోటల్ సిబ్బంది మార్చకపోవడాన్ని గుర్తించి వారిని ప్రశ్నించింది.

ఈ సమయంలో పెద్ద వివాదం చెలరేగింది. ఒకానొక సమయంలో హోటల్ సిబ్బందిలో ఒకరు ఆమెపై దాడి చేసినట్లు సమాచారం. సిబ్బంది సమాచారంతో అక్కడకి చేరుకున్న పోలీసులు చర్చలు జరపగా.. సదరు నటి తమకు రూ.60 వేల అద్దె చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని ప్రశ్నిస్తే తమతో గొడవకి దిగిందని హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పరిస్థితి ఓ కొలిక్కి రావడంతో పోలీసులు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ విషయంపై నటి మంజు మాట్లాడుతూ.. ''నా గదిని శుభ్రం చేయకపోవడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే దానికి వారు నాకు సమాధానం ఇవ్వకుండా నేను అద్దె చెల్లించలేదని గొడవకి దిగారు. నన్ను హేళన చేస్తూ మాట్లాడారు'' అని ఆవేదన వ్యక్తం చేసింది.