మలయాళ నటులు తెలుగులో వరుసగా అలరిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ `పుష్ప`లో, పృథ్వీరాజ్ సుకుమారన్ `సలార్`లో నటిస్తున్నారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాతో మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
`ఉప్పెన` సినిమాతో ఉప్పెనలా దూసుకొచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత నటించిన ఆయన సినిమాలు బోల్తా కొట్టాయి. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇందులో శ్రీలీలా ఆయనకు జోడీగా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది యూనిట్. ఇందులో మలయాళ హీరో కీలక పాత్రలో నటిస్తున్నారని వెల్లడించింది. ఇటీవల `ఇరాట్ట` చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకున్నారు మలయాళ నటుడు జోజు జార్జ్. ఆయన తాజాగా వైష్ణవ్ తేజ్ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికయ్యారు. ఇటీవల మలయాళ హీరోలు వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జోజు జార్జ్ సైతం తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. దీంతో ఇది సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఆయన ఈ సినిమాలో చెంగారెడ్డిగా కనిపించబోతున్నట్టు తెలిపారు.
ఆ విశేషాలను చిత్ర బృందం వెల్లడించింది. `తొలి చిత్రంతోనే ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. భారీస్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ప్రతినాయకుడి పాత్రను పరిచయం చేస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంలో చెంగా రెడ్డి అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. `ఇరాట్ట`, `జోసెఫ్`, `నయత్తు`, `తురముఖం`, `మధురం` వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన పలు పురస్కారాలను సైతం అందుకున్నారు.
ఇప్పుడు జోజు జార్జ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన పోషిస్తున్న చెంగా రెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్ తో నోట్లోని సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఉన్న జోజు జార్జ్ పాత్ర తాలూకు పోస్టర్ పవర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంది. అలాగే జోజు జార్జ్ నటించిన `ఇరాట్ట` సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందటంతో చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు.
వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి .ప్రొడక్షన్ డిజైనర్: ఎ ఎస్ ప్రకాష్, ఎడిటర్: నవీన్ నూలి.
