సెలబ్రిటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే అభిమానులు వారితో ఫోటోలు దిగాలని ఆరాటపడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అది కాస్త మితిమీరిపోతుందనే చెప్పాలి. ఆ కారణంగానే సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ పై చికాకు పడుతున్నారు.

తాజాగా నటి మలైకా అరోరా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె తన తండ్రితో కలిసి ముంబైలో ఓ మాల్ కి వెళ్లింది. ఆమెని చూసిన అభిమానులు సెల్ఫీలంటూ వెంటపడ్డారు. కొందరితో ఫోటోలు దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించినా.. వారు ఆమె వెంటపడ్డారు.

చాలా మంది చుట్టుముట్టడంతో ఆమె ఇబ్బంది పడింది. ఆమె తండ్రి అభిమానులను దూరంగా ఉండమని చెబుతున్నా వారు పట్టించుకోలేదు. దీంతో మలైకా వారి నుండి ఎలాగోలా తప్పించుకొని కారు ఎక్కివెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు అభిమానుల తీరుపై 
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, జనాలు కాస్త హద్దుల్లో ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలు చిరాకు పడడంలో తప్పే లేదని, వారు  విహార యాత్రల కోసం ఫారిన్ వెళ్లడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని కామెంట్స్ పెడుతున్నారు.