మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘దృశ్యం 2’ . రిలీజై ఈ సినిమా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్‌ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కించారు.  ఇప్పటికే దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్‌ డే సందర్భంగా జూన్‌ 20న విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.

 ఈ క్రమంలో ఈ సినిమాని హిందీలోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.సీక్వెల్ హక్కులను పనోరమా ఇంటర్నేషనల్ స్టూడియోస్ ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇక్కడే సమస్య వచ్చింది. వయాకామ్ 18 వారు ఈ రీమేక్ విషయమై కుమర్ మంగత్ కు లీగల్ నోటీసులు పంపారు.

దృశ్యం సినిమాను తాము కుమార్ మంగత్ పాతక్ తో కలిసి చేసాము కాబట్టి, ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కూడా తమతో కలిసి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండిపెండెంట్ గా,తమ ఇన్వాల్వ్ లేకుండా చేయటానికి వీల్లేదన్నారు. అయితే కుమార్ మంగత్ మాట్లాడుతూ తాము లీగల్ గా  ‘దృశ్యం 2’ కు సంభందించి సర్వ హక్కులు కలిగి ఉన్నాము అని తేల్చి చెప్పారు. మరి ఈ విషయం ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. 
 
 ‘దృశ్యం’ హిందీ వెర్షన్‌లో అజయ్‌ దేవ్‌గణ్, టబూ, శ్రేయ నటించారు. దృశ్యం2 హిట్‌ అవడంతోటే హిందీలో కూడా రీమేక్‌ పనులు మొదలయ్యాయి. దృశ్యంలో నటించినవారే ఇందులో కూడా నటించే అవకాశాలున్నాయి. అయితే ‘దృశ్యం’కు దర్శకత్వం వహించిన నిషికాంత్‌ కామంత్‌ గత సంవత్సరం సిరోసిస్‌తో మరణించడంతో ఈసారి హిందీ వెర్షన్‌కు జీతూ జోసఫ్‌నే అజయ్‌ తీసుకోనున్నాడని వినికిడి. తెలుగు రీమేక్‌ను పూర్తి చేసుకుని జీతూ హిందీ రీమేక్‌కు వెళ్లొచ్చు.