తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకి వరాలు కురిపించింది. హడావుడిగా థియేటర్ల అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపింది. దీంతో టాలీవుడ్‌కి పూర్వ వైభవం రాబోతుందని చిత్ర పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, రామ్‌చరణ్ వంటి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు హీరో మహేష్‌బాబు, దర్శకులు రాజమౌళి, పూరీ జగన్నాథ్‌, నిర్మాతలు స్పందించి ధన్యవాదాలు చెబుతున్నారు. మహేష్‌బాబు స్పందిస్తూ, `తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద ఊరట. పెద్ద తెరపై సినిమాలు చూడటం, పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది జీవితాలను నిలబెట్టడం అనే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి సహాయక చర్యలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎంకి, కేటీఆర్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు` అని తెలిపారు. 

రాజమౌళి స్పందిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన చాలా అవసరమైన సహాయక చర్యలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సంతోషిస్తుంది. కచ్చితంగా మళ్ళీ పురోగతి మార్గంలో పరిశ్రమ నడుస్తుందని నమ్ముతున్నా. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌కి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. 

అలాగే పూరీ జగన్నాథ్‌ సైతం కీలకమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వీరితోపాటు గీతా ఆర్ట్స్, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కృతజ్ఞతలు తెలిపారు.