2018 సమ్మర్ స్టార్టింగ్ లో రంగస్థలం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ మహేష్ తో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని సూపర్ స్టార్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

ఈ కాంబినేషన్ లో షూటింగ్ మొదలవ్వకముందే సుకుమార్ రాసుకున్న కథపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అప్పట్లో తెలంగాణ రజాకార్ల బ్యాక్ డ్రాప్ లో మహేష్ వారిని ఎదిరించే వ్యక్తిగా కనిపిస్తాడని అది ఒక పీరియాడిక్ సినిమా అని టాక్ వచ్చింది. అయితే మహేష్ ఆ ప్రాజెక్ట్ సెట్టవ్వదని చెప్పడంతో మరో కథను వినిపించిన సుక్కు ఫైనల్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేందుకు సిద్దమయ్యాడు. 

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సుకుమార్ మహేష్ తో కొత్త సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీలా కాకుండా రొమాంటిక్ యాక్షన్ జానర్ ను తనదైన శైలిలో సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నట్లు టాక్. మహేష్ మహర్షి సినిమా షూటింగ్ అనంతరం ఈ ఏడాది జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ కొత్త సినిమాను నిర్మించనుంది.