ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'స్పైడర్' స్పైడర్ ఓవర్సీస్ రైట్స్ కు రికార్డు ధర 15.2 కోట్ల కు కొనుగోలు చేసిన ప్రముఖ పంపిణీ సంస్థ
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే ఆయన సినిమా అంటే అటు ఓవర్సీస్ రైట్స్, ఇటు థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాకుండా... శాటిలైట్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోతుంటాయి. మహేష్ బాబు ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలో భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్రిబాషా చిత్రం కావడంతో ఓవర్సీస్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.
ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను రూ.15.2 కోట్లను చెల్లించి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకుందట. మహేష్ బాబు కెరీర్లో ఓవర్సీస్ కి సంబంధించి ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు రావాలంటే సినిమా కనీసం 3 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీలో విడుదలవుతుంది కాబట్టి ఆ మొత్తం వసూలు కావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు.
ఇక 'స్పైడర్' సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ మీద ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు. రొమేనియాలో ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులో 'స్పైడర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రూ.130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తోంది. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.
