మహేష్ జోరు మాములుగా లేదు. గత మూడేళ్ళుగా ఆయన వరుస బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తున్నారు. భరత్ అనే నేను సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన మహేష్, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాల విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేశారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించింది. ఇక బుల్లితెరపై కూడా సరిలేరు నీకెవ్వరు రికార్డు టీఆర్పీ దక్కించుకోవడం జరిగింది. సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత లాక్ డౌన్ కారణంగా కొంచెం గ్యాప్ తీసుకున్నారు. 

లాక్ డౌన్  సమయంలోనే మహేష్ తన నెక్స్ట్ మూవీపై ప్రకటన చేశారు. తన తండ్రి కృష్ణ గారి పుట్టినరోజు మే 31న సర్కారు వారి పాట మూవీని ప్రకటించడం జరిగింది. దర్శకుడు పరుశురామ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ లోగో, మహేష్ ప్రీ లుక్ మూవీపై అంచనాలు పెంచేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

కాగా దాదాపు ఏడు నెలలుగా ఇంటికే పరిమితం అవుతున్న మహేష్ మొదటిసారి బయట కనిపించారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ సెట్స్ లో ఉన్న మహేష్ ఫోటో బయటికి రాగా ఆసక్తి రేపుతోంది. ఓ వ్యాపార ప్రకటన చిత్రీకరణ కోసం మహేష్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఎల్లో కలర్ షర్ట్, కార్గో టైపు బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్న మహేష్ లుక్ కేక అని చెప్పాలి. సర్కారు వారి పాట మూవీ కోసం మహేష్ జుట్టు పెంచుతుండగా, కొంచెం పెరిగిన జుట్టులో ఆయన కనిపించారు.