సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా నటించిన మెసేజ్ ఓరియెంటెండ్ ఫిల్మ్ ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు.  మ‌హేష్‌బాబు కెరియ‌ర్‌లో ఫ‌స్ట్ వీక్ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ కావటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు.  

ఇంత పెద్ద సక్సెస్  సాధించడంతో ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పేందుకు బుధవారం (మే 15)నాడు సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం థియేట‌ర్‌కి వెళ్లి వారిని కలిసారు.  అదే వేదికపై ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ల తేదీని ప్ర‌క‌టించాడు. విజ‌య‌వాడ‌లో ఈ నెల 18న పెద్ద ఎత్తున స‌క్సెస్ ఈవెంట్‌ని నిర్వ‌హించ‌నున్నారని చెప్పారు.

గతంలోనూ తన కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల  విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు మహేష్ బాబు. మహర్షి సైతం ల్యాండ్‌మార్క్  మూవీ గా తన కెరీర్ లో నిలవటంతో ఈ సినిమా స‌క్సెస్ ఈవెంట్‌ని కూడా మే 18 సాయంత్రం బెజ‌వాడ‌లో నిర్వ‌హించాలని ఫిక్సయ్యారు. దానికి తోడు... ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ముగ్గురు నిర్మాత‌ల్లో  ఇద్ద‌రు (అశ్వ‌నీద‌త్‌, పీవీపీ) విజ‌య‌వాడ ప్రాంతానికి చెందిన వారే కావటం కూడా ఈ ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేయటానికి మరో కారణం.