మహేష్‌ సినిమా కథపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ స్పందించారు. మహేష్‌-రాజమౌళి సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చారు. 

ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) ప్రమోషన్‌లో బిజీగా ఉన్న రాజమౌళి(Rajamouli) నెక్ట్స్ సూపర్‌స్టార్‌ మహేష్‌(Mahesh)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర కథపై వర్క్ జరుగుతుంది. రాజమౌళి తండ్రి, స్టార్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్ర కథని రాస్తున్నారు. ఈ సినిమా స్టోరీపై, మహేష్‌ పాత్రపై చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇది మల్టీస్టారర్‌ అంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ రాజమౌళి దీనిపై స్పందించి ఇది మల్టీస్టారర్‌ కాదని చెప్పడంతో మహేష్‌ సోలోగానే రాబోతున్నారనే విషయం కన్ఫమ్‌ అయ్యింది. 

ఇదిలా ఉంటే సినిమా కథపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ స్పందించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో భాగంగా ఆయన కూడా మీడియాకి ఇంటర్వ్యూలిచ్చారు. అందులో భాగంగా మహేష్‌-రాజమౌళి సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చారు. మహేష్‌తో రాజమౌళి సినిమా ఆఫ్రికన్‌ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇదే కథపై తాను వర్క్ చేస్తున్నానని, కథ రన్నింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదలయ్యాక రాజమౌళి ఫీ అవుతాడని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్క్రిప్ట్ పై డిస్కస్‌ చేస్తామని చెప్పారు విజయేంద్రప్రసాద్‌. తమ ఇద్దరి నిర్ణయాలను బట్టి కథ స్వరూపం ఆధారపడి ఉంటుందన్నారు. అయితే సినిమా నేపథ్యం ఆఫ్రికన్‌ అడవులు అనేది కన్ఫమ్‌ అని తేల్చి చెప్పారు దిగ్గజ రైటర్‌. సినిమా కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని చెప్పారు. ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా రావడం తెలుగులో చాలా అరుదు. పూర్తి స్థాయి సినిమా అంటే ఇదే కాబోతుందని చెప్పొచ్చు. 

విజువల్‌ వండర్‌గా, హై టెక్నీకల్‌ స్టాండర్డ్స్ లో, సాహసోపేతంగా ఈ చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో సాహసికుడిగా మహేష్‌ కనిపిస్తారని, స్టయిలీష్‌గానే కాదు, ఆయన పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఇంటర్నేషనల్‌ స్టాండర్ట్స్ లో, యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యేలా ఈ కథ సాగుతుందని సమాచారం. తెలుగు, తమిళం,హిందీలోనూ ఈ సినిమా ఏకకాలంలో తెరకెక్కించి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్‌. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అంటేనే అంచనాలు ఊహకందని విధంగా మారిపోయాయి. మరి సినిమా ఏం రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. 

ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తుంది. ఇందులో కీర్తిసురేష్‌ కథానాయికగా నటించింది. ఇటీవల విడుదల రెండు పాటలు దుమ్మురేపుతున్నాయి. `కళావతి` సాంగ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తే, ఇటీవల రిలీజ్‌ చేసిన `పెన్నీ` సాంగ్‌ సైతం ఊపేస్తుంది. ఇందులో మహేష్‌ కూతురు సీతార డాన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు త్రివిక్రమ్‌తోనూ ఓ సినిమా చేస్తున్నారు మహేష్‌. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.