రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ చేస్తే చూడాలనేది ఫ్యాన్స్ కల. దాదాపు అందరు స్టార్ హీరోలతో చిత్రాలు చేసిన రాజమౌళి మహేష్ తో ఒక్క చిత్రం కూడా చేయలేదు. దీనికి ప్రత్యేక కారణం లేదు, అవకాశం కుదరకపోవడమే. కాగా మూవీ లవర్స్ సైతం ఆశగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ సాకారం అయ్యింది. గత ఏడాది రాజమౌళి మహేష్ తో మూవీ ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన చేయబోయేది మహేష్ బాబుతోనే అని స్పష్టంగా చెప్పారు. 

నిర్మాత కే ఎల్ నారాయణ మహేష్ తో మూవీ చేయాలని రాజమౌళికి చాలా ఏళ్ల క్రితమే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. రాజమౌళి మహేష్ తో మూవీ ప్రకటించిన వెంటనే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. మహేష్ కోసం రాజమౌళి సిద్ధం చేసిన స్టోరీ లైన్ ఇదే అంటూ రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. 


ఇటీవల మహేష్-రాజమౌళి మూవీ నేపథ్యం ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సారి భిన్నంగా రాజమౌళి జంగిల్ బ్యాక్ గ్రౌండ్ ఎంచుకున్నారట. అడవి నేపథ్యంలో సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలతో భారీ ఎత్తున తెరకెక్కించనున్నారట. ప్రముఖంగా వినిపిస్తున్న ఈ వార్తపై మూవీ నిర్మాత కె ఎల్ నారాయణ స్పందించారు. ప్రచారం అవుతున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. 


ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారని, స్టోరీ లైన్ పై వర్క్ చేస్తున్నప్పటికి ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. అసలు ఆ స్టోరీ లైన్ ఏమిటో నాకే తెలియదు కాబట్టి. మిగతా వారికి తెలిసే ఆస్కారం లేదు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలే అంటూ కథనాలకు తెరదించారు.