మహేష్‌బాబు హీరోయిన అమృతా రావు తన ఆవేదనని పంచుకుంది. మహేష్‌తో సినిమా చేసే సమయంలో ఓ వ్యక్తి చేసిన మోసం కారణంగా తాను సల్మాన్‌ ఖాన్‌ ఆఫర్‌ని మిస్‌ అయినట్టు చెప్పింది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌తో `అతిథి` సినిమాలో నటించి ఆకట్టుకుంది అమృతారావు. ఆమె తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా తన ఇంపాక్ట్ ని తెలుగు ఆడియెన్స్ పై వేసింది. ఆ తర్వాత హిందీకే పరిమితమైన ఈ బ్యూటీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చింది. కెరీర్‌ పరంగా పలు ఒడిదుడుకులను ఫేస్‌ చేసిన ఈ బ్యూటీ తన అనుభవాలతో ఓ పుస్తకాన్ని రాసింది. తన జీవితంలో ఎదురైన సంఘటనలతో `కపుల్‌ ఆఫ్‌ థింగ్స్` అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఇందులో తాను మోసపోయిన సంఘటన గురించి పంచుకుంది. మహేష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో తాను సల్మాన్‌ ఖాన్‌తో నటించే ఆఫర్‌ని కోల్పోయినట్టు చెప్పింది. దానికి కారణాలను ఆమె బయటపెట్టింది. 

మహేష్‌బాబుతో `అతిథి` సినిమా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌లో ఉందట అమృతారావు. ఆ సమయంలో ఓ రోజు సాయంత్రం తాజ్‌ బంజారా హోటల్‌లో నిర్మాత బోనీ కపూర్‌తో పనిచేసిన వ్యక్తి కలిశాడు. తనని చూడగానే దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఓ పెద్ద పిడుగులాంటి వార్త చెప్పాడట. పలకరింపులు అయ్యాక .. `నీ డేట్స్ అడ్జెస్ట్ అయ్యుంటే మాతోపాటు సల్మాన్‌ ఖాన్‌ `వాంటెడ్‌` సినిమా షూటింగ్‌ ఉండేదానివి` అని అన్నాడట. ఆయన చెప్పిన మాటకు తన మైండ్‌ బ్లాంక్‌ అయిపోయిందట అమృతా రావుకి. `వాంటెడ్‌` సినిమా కోసం తననెప్పుడు అడిగారని ప్రశ్నించగా, `మీ మేనేజర్‌కి ఫోన్‌ చేస్తే, నీ డేట్స్ సర్దుబాటు కావడం కష్టమని చెప్పాడు` అని అతను చెప్పడంతో తన హార్ట్ బ్రేక్‌ అయినంత పనైందని వెల్లడించిందీ మహేష్‌ భామ.

సల్మాన్‌ ఖాన్‌తో సినిమాచేసే అవకాశం వస్తే మేనేజర్‌ తనకు చెప్పకుండా మోసం చేశాడని ఆవేదన చెందింది అమృతారావు. అంత మంచి ఆఫర్ వస్తే తానెందుకు మిస్‌ చేసుకుంటాను, కచ్చితంగా తన డేట్స్ ఇచ్చేదాన్ని అని, కానీ మేనేజర్‌ చేసిన పనికి చాలా పెద్ద ఆఫర్‌ మిస్‌ అయ్యానని ఆమె తన పుస్తకంలో ఆ బాధని వెల్లడించింది. ఆ దెబ్బతో తన మెనేజర్‌ని వెంటనే తీసేసిందట. కానీ అతను తనకు మర్చిపోలేని బాధని మిగిల్చాడని తన బుక్‌లో రాసుకొచ్చింది అమృతారావు.

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ నటించిన `వాంటెడ్‌`లో ఆయేషా టకియా హీరోయిన్‌గా నటించింది. ఇది భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇది తెలుగులో వచ్చిన `పోకిరి`కి రీమేక్‌. క్యూట్‌ లుక్‌లో కట్టిపడేసే ఈ భామ 2014లో ఆర్జే అన్మోల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం రహస్యంగా జరిగింది. కానీ రెండేళ్లకి బహిర్గతం చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుందీ క్యూట్‌ బ్యూటీ.

ఈ పుస్తకంలోనే మరో రహస్యాన్ని బయటపెట్టింది. వీరు పిల్లలను కనేందుకు సరోగసి ఎంచుకున్నారట. సరోగసిలోని ఐయూఐ,ఐవీఎఫ్‌, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతులను ఎంచుకున్నట్టు తెలిపింది. అందులో భాగంగా సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనాలని భావించినప్పుడు, ఈ పద్ధతి ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే బిడ్డని కోల్పోయినట్టు తెలిపింది అమృతారావు. దీంతో చాలా బాధపడినట్టు చెప్పింది. తల్లిదండ్రులు కావాలన్న ఉత్సాహంలో పొరపాట్లు చేస్తారని చెప్పింది అమృత.