ప్రముఖ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌.. మహేష్‌ ఫ్యాన్స్ కి అడ్డంగా దొరికిపోయాడు. వారి ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్ళ తిట్టకి, ట్రోలింగ్‌కి బలవుతున్నాడు. మరి తమన్‌పై ఇంతగా మహేష్‌ ఫ్యాన్స్ కోపానికి కారణమేంటి? తమన్‌ ఏం చేశాడనేది చూసినప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటపడింది. 

ఈ నెల 9న మహేష్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి శుక్రవారం మహేష్‌బాబు ఓ లేఖని ట్వీట్‌ చేశారు. అందులో తన పుట్టిన రోజున అభిమానులు సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఆరోగ్యం ముఖ్యమని, అందరు సురక్షితంగా ఉండాలని చెప్పారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ స్పందించారు. మహేష్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేస్తూ `మంచి నిర్ణయం బ్రదర్‌` అని పేర్కొన్నారు. 

ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతుంది. మహేష్‌ అభిమానుల కోపానికి కారణమైంది. గతంలో ఎప్పుడైనా మహేష్‌ని సర్‌ అని పిలిచే తమన్‌ ఉన్నట్టుండి ఇప్పుడు బ్రదర్‌ అనడం పట్ల మహేష్‌ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. అంతటితో ఆగలేదు, తమన్‌పై మాటల యుద్ధంతో విరుచుకుపడుతున్నారు. మా హీరోను నువ్వు బ్రదర్ అని పిలుస్తావా? సార్ అని పిలవాలి కదా అంటూ, సారీ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి `నీకు చాలా బలిసింది` అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. అంతేకాదు తమన్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. 

దీనిపై మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ అందులో తప్పేముందని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు.  మరి దీనిపై తమన్‌ స్పందిస్తాడా? ఈ ట్విట్టర్‌ దుమారం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇందులో విచిత్రమేంటంటే ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య పెరిగిన అనుబంధం మహేష్‌ని తమన్‌ బ్రదర్‌ అనేలా చేసిందేమో..?  మొత్తానికి ఇప్పుడు తమన్‌ని మహేష్‌ అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారని చెప్పొచ్చు.