టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఈ నెల 9న పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ప్రతీ ఏటా మహేష్ జన్మదిన వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఓవర్‌ సీస్‌లోనూ భారీ ఫాలోయింగ్ ఉండటంతో మహేష్ జన్మదిన వేడుకలు విదేశాల్లో కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పండుగ వాతావరణమే ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మహేష్ అభిమానులకు వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా అభిమానులకు సందేశం ఇచ్చాడు. `ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టిన రోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది.

అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నింటికంటే ముఖ్యంగా నా పుట్టిన రోజు అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ ఓ సందేశాన్ని రిలీజ్ చేశాడు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు కూడా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయా ప్రముఖులు కూడా కరోనా భారిన పడుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.