పెరిగిపోతున్న టెక్నాలజీ, పరిశ్రమలు, కాలుష్యం కారణంగా ప్రకృతి ఎంతగా దెబ్బ తింటుందో చూస్తూనే ఉన్నాం. నగరీకరణ నేపధ్యంలో అడవులను నరికేస్తున్నారు. చెట్లను పెంచాలనే విషయాన్ని మానవాళి మరచిపోతున్న ఇలాంటి సమయంలో మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. 

మానవాళికి ఇరవై శాతం ఆక్సిజన్ అందిస్తోన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దగ్ధం కావడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త తనను ఎంతగానో కలచివేస్తోందని చెప్పారు.

'లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్' అని చెప్పుకునే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అగ్నికి ఆహుతవుతోందని.. ఇరవై శాతం ఆక్సిజన్ అక్కడ నుండే పర్యావరణంలోకి అందుతోందని.. ఇప్పటికైనా మనం మేల్కొవాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలని చెప్పారు.

భూమిని కాపాడుకోవడం కోసం కలిసి కట్టుగా పని చేద్దామని అన్నారు. మరో హీరో అల్లు అర్జున్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. వాతావరణంపై ఇది భారీ ఇంపాక్ట్ చూపిస్తుందని అన్నారు.