ప్రముఖ నటి, మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫుడ్ డెలివెరీ సంస్థ జొమాటో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

అందులో జొమాటో డెలివెరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసి కొంచెం కొంచెం తిని, తిరిగి ప్యాక్ చేసి డెలివెరీ చేశాడు. ఈ నిర్వాకం మొత్తం కెమెరాలో బంధించారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇది చూసిన నెటిజన్లు సదరు ఫుడ్ డెలివెరీ సంస్థపై విరుచుకుపడుతున్నారు. నమ్రత సైతం ఈ వీడియో చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేసి చెడామడా తిట్టేసింది. ఆమె పెట్టిన పోస్ట్ లో ''ఇంత పేరున్న ఫుడ్ డెలివెరీ సంస్థ పనితీరు చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు.

కానీ ఈ విధంగానా డెలివర్ చేసేది..? మీకు వర్క్ ఎథిక్స్ అనేవే లేవా..? ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నా పిల్లలను మాత్రం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను. అందరికీ కూడా నా సజెషన్ ఇదే..'' అంటూ రాసుకొచ్చారు.