ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్ జరగడం విశేషం. మ్యాచ్ తో పాటు సూపర్ ఓవర్ కూడా టై గా ముగిసింది.

విజయం కోసం ఇరు జట్లు ఎంతగా పోరాడాయో దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఫైనల్ గా ఎక్కువ బౌండరీలు తీసిన ఇంగ్లాండ్ ని విజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. అయితే ఓ మంచి మ్యాచ్ చూశామనే ఫీలింగ్ మాత్రం అందరిలో ఉంది.

సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఎందరో ఈ వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ప్రదర్శనను పొగుడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరల్డ్ కప్ ఫైనల్ పై స్పందించారు.

''ఇప్పటికీ వరల్డ్ కప్ మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు కానీ న్యూజిలాండ్ మాత్రం హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు'' అంటూ ట్వీట్ చేశారు. సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.