చిత్ర పరిశ్రమలో చాలా క్రేజీ కాంబినేషన్లు మధ్యలోనే ఆగిపోయాయి. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ప్రారంభమైన చిత్రాలు కూడా మధ్యలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహేష్ బాబు సోదరి మంజుల పలు చిత్రాల్లో వెండి తెరపై మెరిశారు. దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ఆమె గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మంజుల భవిష్యత్తులో మరిన్ని చిత్రాలని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. 

ఇదిలా ఉండగా మంజుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గతంలో ఆమెకు హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందట. నందమూరి బాలకృష్ణ నటించిన టాప్ హీరో చిత్రం 1994లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. 

ఈ చిత్రంలో బాలయ్య, సౌందర్య జంటగా నటించారు. మొదట్లో ఈ చిత్రంలో హీరోయిన్ గా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజులని హీరోయిన్ గా అనుకున్నారట. ఈ విషయాన్ని మంజులే స్వయంగా వెల్లడించింది. కానీ నాన్నగారి అభిమానులు నేను హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోలేదు. 

మంజుల హీరోయిన్ గా నటిస్తే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాం అంటూ స్టూడియో ముందుకు అభిమానులు వచ్చారు. నాన్నగారు మంజుల హీరోయిన్ గా నటించడంలేదు అని ప్రకటన చేసిన తర్వాతే వాళ్ళు వెనక్కి తగ్గారు. నన్ను వాళ్ళ సోదరిగా, ఇంటి ఆడపడుచుగా అభిమానులు భావించారు. అందుకే సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు అని మంజుల తెలిపింది. మంజుల పోకిరి, ఏ మాయ చేసావే లాంటి చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.