ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు సూపర్‌ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తరువాత మరో సినిమాను ప్రకటించేందుకు చాలా గ్యాప్ తీసుకున్నాడు సూపర్‌ స్టార్‌. ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రకటించినా ఆ సినిమాను క్యాన్సిల్ చేసి గీతా గోవిందం ఫేం పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు మహేష్‌.

మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ మహేస్ వరుసగా షాక్‌లు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు తెలియకపోయినా మహేష్ తీరుతో చిత్రయూనిట్ ఇబ్బంది పడుతుందన్న టాక్‌ వినిపిస్తోంది.

లాక్‌ డౌన్‌ కారణంగా చిత్రపరిశ్రమ నష్టాల పాలు కావటంతో నిర్మాణ సంస్థలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌ను తగ్గించుకునే పనిలో ఉన్నారు. దీంతో హీరోను బడ్జెట్‌ తగ్గించుకోమనే ధైర్యం లేక దర్శకుడి పేమెంట్‌లో కోత పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై నెలాఖరు నాటికి సినిమాను సెట్స్‌ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేశారు.

అయితే తాజాగా మహేష్ మరో షాక్‌ ఇచ్చాడట. తాను ఈ ఏడాది డిసెంబర్‌ వరకు ఎలాంటి షూటింగ్‌లు చేయబోనని చెప్పేశాడట. కరోనా ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గితేగాని షూటింగ్‌లకు హాజరు కాను అని చెప్పటంతో చిత్రయూనిట్ తల పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోటంతో అసలు విషయం తెలుసుకునేందుకు ఇండస్ట్రీ జనాలు కూడా ప్రయత్నిస్తున్నారు.