- Home
- Entertainment
- Epic Teaser: ఎపిక్ టీజర్ రివ్యూ, అన్న బాటలో తమ్ముడు.. వైష్ణవి చైతన్యతో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ఆనంద్
Epic Teaser: ఎపిక్ టీజర్ రివ్యూ, అన్న బాటలో తమ్ముడు.. వైష్ణవి చైతన్యతో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ఆనంద్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్ టీజర్ విడుదలైంది. టీజర్ లోనే హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చూపించేశారు. టీజర్ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి.

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'సంచారమే' అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది.
టీజర్ వచ్చేసింది
'ఎపిక్' టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్నారు. తాజాగా విడుదలైన టీజర్, మొదటి సినిమాతోనే ఆయన ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లిప్ లాక్ సీన్
లండన్ నేపథ్యంతో సాగే ఈ చిత్రం ఒక అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా కనిపిస్తోంది. ఆధునిక సంబంధాలు, ప్రేమలో మారుతున్న భావోద్వేగాలను ఈ సినిమా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమకథలో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ (అంతర్ముఖుడు) పాత్రలో కనిపిస్తుండగా, వైష్ణవి చైతన్య పూర్తి విరుద్ధంగా ఎక్స్‌ట్రోవర్ట్ (బహిర్ముఖురాలు) పాత్రలో ఆకట్టుకోనున్నారు. విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వారి ప్రయాణం ఎలా సాగింది? అనేది టీజర్‌లో ఎంతో హృద్యంగా చూపించారు. టీజర్ లో చూపిన సన్నివేశాల ప్రకారం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య రొమాన్స్ లో రెచ్చిపోయారు. ఇద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్లు, బోల్డ్ రొమాన్స్ ఉన్నట్లు అర్థం అవుతోంది. రొమాంటిక్ హీరోగా ఇప్పటికే విజయ్ దేవరకొండ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా వేస్తున్నాడు.
నా కథ నాకే చెప్పాడా
హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో జరిగిన 'ఎపిక్' టీజర్ ఆవిష్కరణ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎపిక్ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుకున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చుతాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ లో ఎంతో ప్రతిభ ఉంది. భవిష్యత్తులో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో కొత్త దర్శకులు వస్తారు. వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సార్, లక్కీ భాస్కర్, టిల్లు, మ్యాడ్, జెర్సీ లాంటి సినిమాల సరసన ఎపిక్ చేరుతుందనే నమ్మకం ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది. ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశారు." అన్నారు.
ఎపిక్ నా మనసుకి దగ్గరైన సినిమా
కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. "ముందుగా 'సంచారమే' పాటపై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఎపిక్ కథ నాకు చాలా నచ్చింది. కథ వినగానే నేను ఈ సినిమాలో భాగం కావాలి అనుకున్నాను. నేను పోషించిన కడలి పాత్ర చాలా బాగుంటుంది. కథ వినేటప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో ఆ కడలి ఉంటుంది అనిపించింది. ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర కూడా బాగుంటుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఎపిక్ నా మనసుకి దగ్గరైన సినిమా. ఇదొక అందమైన ప్రేమ కథ. మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే మన స్నేహితులు గుర్తుకొస్తారు. మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.

