సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ నేడే విడుదల సూపర్ హిట్ టాక్ ను రిలీజ్ ముందే తెచ్చుకున్న స్పైడర్ శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం కథ సరిగా లేకనే ఫ్లాప్ అయిందన్న మహేష్ బాబు

“బ్రహ్మోత్సవం” కధను ఎంపిక చేసుకోవడం ప్రిన్స్ మహేష్ బాబు తన కెరీర్ లో వేసిన భారీ తప్పటడుగుగా అప్పట్లో సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత అదే తరహా పాత్రను ఎంపిక చేసుకోవడం అనేది మహేష్ చేసిన మొదటి తప్పుగా అభివర్ణించారు. ఇక బ్రహ్మోత్సవం తర్వాత తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘స్పైడర్’ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు ప్రిన్స్. మరోవైపు స్పైడర్ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం పరాజయానికి కారణం కథేనన్న విషయాన్ని మహేష్ బాబు కూడా అంగీకరించారు. 

‘బ్రహ్మోత్సవం’ చేయడం తన సరైన నిర్ణయం కాదని చెప్పిన మహేష్, ఇలాంటివే తనకు పాఠాలు నేర్పుతుంటాయని కూడా అన్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తర్వాత బాగా డిజప్పాయింట్ అయిన మాట నిజం అని, దాని నుండి బయటపడేసింది తన పిల్లలే అని, ఈ సినిమా వలన చాలా మంది బాధపడ్డారని, తనను నమ్మి డబ్బులు పెట్టిన వారు ఇబ్బందులు పడ్డారని, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవడమే తన బాధ్యత అని చెప్పారు ప్రిన్స్.

జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవని, మనం అనుకున్నవి కొన్ని తలక్రిందులు అవుతుంటాయని, ‘బ్రహ్మోత్సవం’ కూడా అలాంటిదేనని కాస్త వేదాంతధోరణిలో కూడా మాట్లాడారు. “స్పైడర్” ఫలితంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కధ యూనివర్సల్ కావడంతో, రెండు భాషల్లో కూడా విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచిన ప్రిన్స్, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న “భరత్ అనే నేను” గురించి మాట్లాడడానికి ఆసక్తి కనపరచలేదు. షూటింగ్ ఇటీవలే మొదలైందని, ఇప్పుడే మాట్లాడడం సరైనది కాదని అన్నారు.