సినీ తారలు ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతుంటారు. ఒక్కొక్కరి వ్యాపార ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయి. స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన 'ఏఎంబీ' సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 
మరో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు.

సొంతంగా దుస్తుల బ్రాండ్ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 'మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి'అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను మహేష్ టీమ్ పోస్ట్ చేసింది. దీన్ని మహేష్ తిరిగి షేర్ చేశారు. ఇందులో మూడు రోజుల కౌంట్ డౌన్ ఉంచారు.

ఈ పేజ్ లో కింది భాగంలో రకరకాల దుస్తులు, బ్రాండ్ లు ఉంచారు. దీన్ని బట్టి చూస్తుంటే మరో మూడు రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'రౌడీ' పేరుతో సొంత దుస్తుల బ్రాండ్ ని మొదలుపెట్టాడు. బాలీవుడ్ లో చాలా మంది తారలు సొంతంగా దుస్తులు, కొన్ని బ్రాండ్ లను రన్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది  సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్.