గత మూడు నెలలు సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఎప్పుడు షూటింగ్లు, ప్రయాణాలతో బిజీగా ఉండే స్టార్ హీరోలు ఇప్పుడు ఖాళీ సమయం దొరకటంతో ఆ ఫ్రీ టైంను ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటంతో పాటు సినిమాలు చూస్తున్నారు. సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఓటీటీ ద్వారా సినిమాలు చూస్తున్నాడు మహేష్.

తాజాగా ఓ తమిళ సినిమాను చూసిన మహేష్, ట్విటర్‌ వేదికగా ఆ చిత్రయూనిట్‌ను అభినందించాడు. `ఓ మై కడవులే` ఈ సినిమాలో ప్రతీ అంశాన్ని ఎంజాయ్ చేశాను. సూపర్బ్ ఫర్ఫామెన్స్‌, బ్రిలియంట్‌గా రాసిన, డైరెక్ట్ చేసిన కథ. డైరెక్టర్ అశ్వత్‌, అశోక్ సెల్వన్‌` అంటూ ఒక్కొక్కరినీ పేరు పేరునా అభినందించాడు మహేష్. మహేష్ లాంటి సూపర్‌ స్టార్ స్వయంగా అభినందించటంతో చిత్రయూనిట్ ఆనందానికి అవథుల్లేవు.

చిత్ర హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడు మహేష్‌కు ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. స్వయంగా సూపర్‌ స్టార్ తమ సినిమాను పొగడటంతో ఓ మై కడవులే టీం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మహేష్ ప్రశంసించంటంతో ఇప్పుడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.