సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఓ హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకోవడం, ఆ హీరో అంగీకరించని పక్షంలో మరో నటుడితో సినిమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కూడా మహేష్ కోసం అనుకున్న కథ కోసం మరో హీరోని వెతుక్కుంటున్నాడట.

అసలు విషయంలోకి వస్తే.. 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత దర్శకుడు సందీప్ వంగాకి చాలా ఆఫర్లు వచ్చాయి. అందులో మహేష్ బాబు సినిమా కూడా ఉంది. మహేష్-సందీప్ ల మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. సందీప్ వినిపించిన కథ మహేష్ కి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు మహేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కథ బాగున్నప్పటికీ, హీరో క్యారెక్టరైజేషన్ తన ఇమేజ్ కి సరిపోతుందా..? అనే సందేహం మొదటి నుండి మహేష్ కి ఉండేదట. చాలా రకాలుగా ఆలోచించిన తరువాత ఈ కథ వద్దని అనుకున్నాడట మహేష్.

అదే విషయాన్ని సందీప్ కి చెప్పి.. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా పని చేద్దామని మాటిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ 'మహర్షి' సినిమాలో  నటిస్తున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.