సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా మహర్షి చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. మహర్షి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ చిత్రాన్ని పక్కన పెట్టి కొత్త సినిమాతో మహేష్ బిజీ కాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మహేష్ నటించిన ఒక్కడు, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్నించగా.. రీమేక్ చిత్రాల్లో నటించడం తనకు ఇష్టం లేదని మహేష్ బాబు తేల్చి చెప్పేశాడు. ఇక బాలీవుడ్ లో నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన ఫోకస్ మొత్తం తెలుగు సినిమాపైనే అని మహేష్ తెలిపాడు. 

1999లో మహేష్ హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు విడుదలయింది. ఈ 20 ఏళ్లలో కేవలం 25 సినిమాల్లో మాత్రమే నటించారు అని ప్రశ్నించగా.. తనకు హడావిడిగా సినిమాలు చేయాలనే ఉద్దేశం లేదని, సినిమా నిర్మాణంలో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అని మహేష్ అభిప్రాయపడ్డాడు. 

తన పిల్లల విషయంలో తాను గారాబం చూస్తుంటానని, నమ్రత మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుందని తెలిపాడు. నా కుమార్తె సితారకు శ్రీమంతుడు చిత్రం చాలా ఇష్టం. గౌతమ్ మాత్రం అతడు చిత్రాన్ని ఎక్కువగా చూస్తుంటాడు అని మహేష్ తన పిల్లల గురించి వివరించాడు.