సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షితో ఈ ఏడాది ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. వేసవి కానుకగా విడుదలైన మహర్షి మహేష్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మహేష్ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించేశాడు. వరుస హిట్లతో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించనున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

తెలంగాణలో శుక్రవారం రోజు ప్రారంభమైన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అతిథులుగా ఘనంగా జరిగింది.  

సినీ , రాజకీయ ప్రముఖులంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ' విప్లవాత్మక అద్భుతం.. తెలంగాణ ప్రజలు గర్వంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కేటీఆర్ కు శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన ఇంజనీర్లకు హ్యాట్సాఫ్' అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. 

మహేష్, కేటీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. భరత్ అనే నేను చిత్ర సమయంలో కేటీఆర్ మహేష్ బాబుతో కలసి ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. నాగార్జున, సుధీర్ బాబు, రవితేజ లాంటి సినీ ప్రముఖులంతా కాళేశ్వరం ప్రాజెక్టు ని ప్రశంసిస్తున్నారు.