ప్రస్తుతం టాలీవుడ్‌ నెంబర్ 1 హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. వరుస బ్లాక్‌ బస్టర్స్‌తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్‌  చేస్తున్న మహేష్ బాబు హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన 21 ఏళ్లు అవుతుంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తొలి సినిమా రాజకుమారుడు 1999 జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి జింటా మహేష్‌కు జోడిగా నటించింది.

సూపర్‌ స్టార్‌ కృష్ణ అతిది పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ 21 ఏళ్ల కెరీర్‌లో మహేష్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేసినా రాజకుమారుడు మాత్రం తనకు ఎప్పుడూ స్పెషల్ అని చెపుతాడు మహేష్‌. తన తొలి చిత్రం రిలీజ్‌ అయి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహేష్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

తన తొలి చిత్రం రాజకుమారుడు హిట్ ఇచ్చినందుకు రాఘవేంద్ర రావు చిత్రయూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తాను నేర్చుకున్న విషయాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు. గొప్ప టీంతో కలిసి పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. అంటూ ట్వీట్ చేశాడు మహేష్‌.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. `రాజకుమారుడు కి 21 వసంతాలు... ఎన్నో మధుర జ్ఞాపకాలు... మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను` అంటూ ట్వీట్ చేశాడు.