పవన్ కళ్యాణ్ జన్మదినం నేపథ్యంలో చిత్ర ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్నయ చిరంజీవి, హీరో మహేష్ బాబు ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు.
పవన్ ఫ్యాన్స్ కి నేడు పండగ రోజు. నెల రోజుల ముందు నుండే ఫ్యాన్స్ వేడుకలు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన సందడి చేస్తున్నారు. రెండు రోజులుగా జల్సా, తమ్ముడు చిత్రాల స్పెషల్ షోస్ తో తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 51వ ఏట అడుగుపెట్టారు. ఇక అభిమానులు, చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
ఇక అన్నయ్య చిరంజీవి తమ్ముడిపై ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపించారు. ఆప్యాయత అనురాగాలతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ట్విట్టర్ లో''తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను''.. అంటూ పోస్ట్ చేశారు. చిరంజీవి కామెంట్ చేసిన ప్రతి అక్షరంలో తమ్ముడిపై ఉన్న అపరిమిత ప్రేమ కనిపించింది.
సూపర్ స్టార్ మహేష్ సైతం పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పెషల్ విషెస్ చెప్పారు. ''హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు భగవంతుడు కలుగజేయాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఈ ఇద్దరు స్టార్స్ కలిగివున్నారు. వీరి ఫ్యాన్స్ మధ్య తరచుగా వార్స్ నడుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి మహేష్ బర్త్ డే విషెస్ తెలియజేయడం విశేషంగా మారింది. పరిశ్రమకు చెందిన ప్రముఖుల బర్త్ డేలను మరచిపోకుండా విష్ చేసే గొప్ప సంప్రదాయం మహేష్ చాలా కాలంగా పాటిస్తున్నారు.
