సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు 'మహర్షి' సినిమా రిలీజ్ డేట్ విషయంలో రోజుకో వార్త వినాల్సి వస్తోంది. ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించిన చిత్రబృందం దాన్ని కాస్త ఏప్రిల్ 25కి మార్చింది.

ఈ డేట్ న సినిమా రావడం పక్కా అంటూ రెండు సార్లు అనౌన్స్ కూడా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ డేట్ మారింది. నిన్నటి నుండి ఈ సినిమా మేలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమాను మే 9న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ని నిర్వహించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నిజానికి మహేష్ బాబుకి మే సెంటిమెంట్ ఉంది. తన సినిమాలను మేలో రిలీజ్ చేయడానికి ఇష్టపడడు. కానీ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బరువెక్కిన హృదయంతో బయటకి వస్తారంటూ, సినిమాలో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాడు దిల్ రాజు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.