కామెడీ హీరో గా అల్ల‌రి నరేష్ తక్కువ సమయంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ హీరోలే ఆ మధ్యన కామెడీ చేయటం మొదలెట్టడంతో నరేష్ కు మార్కెట్ పడిపోయింది. దాంతో  ఇటీవలి కాలంలో అల్లరి నరేష్ సినిమాలు సరైన  సక్సెస్ ను అందుకోలేదు. దాంతో ఆయన చుట్టూ తిరిగే దర్శక,నిర్మాతలు పలచబడిపోయారు. తాను సీరియల్ రోల్స్ చేస్తే చూడరు. అలాగని కామెడీ లు వర్కవుట్ అవటం లేదు. ఏం చేయాలో తోచని పరిస్దితుల్లో  మహేష్ బాబు హీరోగా చేస్తున్న మహర్షి చిత్రంలో కీలకమైన పాత్ర కమిటయ్యాడు. 

మహర్షి  సినిమాలోని తొలి పాటగా కూడా మహేష్‌, నరేష్‌, పూజలపై తీసిన 'చోటీ చోటీ బాతే' రిలీజ్ అయ్యి క్రేజ్ తెచ్చుకుంది. మహర్షి రిలీజ్‌ తర్వాత మళ్లీ అల్లరి నరేష్‌కి మార్కెట్‌ ఏర్పడుతుందనే నమ్మకంతో అతనితో సినిమాలు చేస్తోన్న వారు ఉషారుగా ఉన్నారు. ఆ సినిమా రిలీజైతే అల్లరి నరేష్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అందరూ భావిస్తున్నారు.

దాంతో నరేష్   తన 55వ సినిమాను పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నారు. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై పి.వి.గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ సినిమా ఇది. 

నరేష్ కు జోడీగా పూజా జవేరి నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు మహర్షి తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.  ఈ సినిమా నరేష్ కు మంచి విజయం అందించేవిధంగా ఉంటుందని ఆయన దర్శక,నిర్మాతలు  చెబుతున్నారు.