Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్‌లకు బ్రేకులు వేసిన లాక్‌డౌన్‌..కార్మికులు బెంబేలు

మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని తీసుకుంది. `బ్రేక్‌ ది చైన్‌` పేరుతో ఏప్రిల్‌ 14 బుధవారం సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్‌డౌన్‌ విధించింది. దీంతో షూటింగ్‌లు, థియేటర్లు నిలిచిపోయాయి. 

maharastra govt lockdown shootings break  arj
Author
Hyderabad, First Published Apr 15, 2021, 10:39 AM IST

కరోనా దేశాన్ని వణికిస్తోంది. ఊహించని విధంగా సెకండ్‌వేవ్‌లో కోవిడ్‌ 19 విజృంభిస్తోంది. జనజీవనం అస్థవ్యస్థంగా మారిపోతుంది. దీని ప్రభావం సినిమాలపై పడుతుంది. మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశంలో ఒక్క రోజు నమోదవుతున్న కేసుల్లో సగం మహారాష్ట్ర నుంచే నమోదవుతుండటం బాధాకరం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని తీసుకుంది. `బ్రేక్‌ ది చైన్‌` పేరుతో ఏప్రిల్‌ 14 బుధవారం సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్‌డౌన్‌ విధించింది. ఈ నేపథ్యంలో కొత్త రూల్స్ ని పెట్టింది. 

కొత్త మార్గదర్శకాల ప్రకారం సినిమా,టీవీ షూటింగ్‌లు కూడా నిలిచిపోతున్నాయి. ఇప్పటికే థియేటర్లు మూసేశారు. అంతకు ముందు థియేటర్లకి అనుమతి లభించినా, ఆశించిన స్థాయిలో సినిమాలు విడుదల కాలేదు. ఇప్పుడు ఏకంగా థియేటర్లే మూసేశారు. మరోవైపు షూటింగ్‌లను కూడా బంద్‌ చేశారు. తాజా నిబంధనల ప్రకారం సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిపివేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో బాలీవుడ్‌లో సినిమాలన్నీ బంద్‌ కాబోతున్నాయి. 

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న షారుక్‌ ఖాన్‌  `పఠాన్‌ `, సల్మాన్‌ ఖాన్‌  `టైగర్‌ 3`, అమితాబ్‌బచ్చన్‌ , రష్మికల `గుడ్‌ బై`, కార్తీక్‌ ఆర్యన్‌  `భూల్‌ భులయ్యా 2` చిత్రాలతోపాటు  ముంబయిలో జరుగుతున్న ఇతర భాషల సినిమాల షూటింగ్‌లకి కూడా బ్రేక్‌ పడింది. `మేం అన్ని రూల్స్‌ పాటిస్తున్నాం. అయినా షూటింగ్స్‌ కారణంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటాం` అని ఫెడరేషన్‌  ఆఫ్‌ వెస్ట్రన్‌  ఇండియా సినీ ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు బీఎన్‌  తివారీ పేర్కొన్నారు. అయితే తాజాగా లాక్‌డౌన్‌తో సినీ కార్మికులు మరోసారి రోడ్డున పడబోతున్నారు. వారంతా బెంబేలెత్తిపోతున్నారు.

ఇదిలా ఉంటే కరోనా బాలీవుడ్‌ సెలబ్రిటీలను వెంటాడుతుంది. ఇప్పటికే అమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తిక్‌ అర్యాన్‌ వంటి వారికి కరోనా సోకింది. వారంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. దీంతో వారి సినిమాల షూటింగ్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios