Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్‌లకు కొత్త నిబంధనలు.. ఇకపై అలాంటి సీన్లకి నో పర్మిషన్‌!

ఇప్పటికే బాలీవుడ్‌ సినిమాలు రిలీజ్‌ డేట్‌లు వాయిదా వేసుకుంటున్నారు. షూటింగ్‌లు కూడా ఆగిపోతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది.

maharastra government implement new rules for cinema shootings  arj
Author
Hyderabad, First Published Apr 10, 2021, 2:18 PM IST

కరోనా ప్రభావం మళ్లీ సినిమాలపై పడుతుంది. గతేడాది కరోనా విజృంభనతో సినిమా విడుదలలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కరోనాతో మళ్లీ ఆ ప్రభావం సినిమాలపై పడబోతుంది. ఇప్పటికే బాలీవుడ్‌ సినిమాలు రిలీజ్‌ డేట్‌లు వాయిదా వేసుకుంటున్నారు. షూటింగ్‌లు కూడా ఆగిపోతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. షూటింగ్‌లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, గుంపులతో కూడిన సీన్స్ చిత్రీకరణ ఆపేయడం లాంటి కోవిడ్‌–19 షూటింగ్‌ నియమావళిని కచ్చితంగా అమలయ్యేలా ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.  

ముంబయ్‌లో కరోనా కేసులతో సినీ, టీవీ రంగంపై పెను ప్రభావం పడడంతో పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఎఫ్‌.డబ్ల్యూ.ఐ.సి.ఇ) ఈ నిర్ణయం తీసుకుంది. అక్షయ్‌ కుమార్,ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి ఫెడ్నేకర్‌ సహా పలువురు ముఖ్యతారలు కరోనా బారిన పడడంతో ఇప్పటికే `రామ్‌ సేతు`, `గంగూబాయ్‌ కాఠియావాడి`, `మిస్టర్‌ లేలే` లాంటి పలు చిత్రాల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్‌.డబ్ల్యూ.ఐ.సి.ఇ. కార్యనిర్వాహక సభ్యులు శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేతో సమావేశమయ్యారు. ప్రభుత్వం పేర్కొన్న జాగ్రత్తలను సినీ, టీవీ పరిశ్రమ బాధ్యతాయుతంగా అనుసరిస్తుందంటూ హామీ ఇచ్చారు. 

ఈ నెలాఖరు దాకా అమలులో ఉండే సరికొత్త షూటింగ్‌ మార్గదర్శకాల ప్రకారం ఇకపై జనసమూహంతో కూడిన సన్నివేశాలనూ, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లున్న పాటలనూ చిత్రీకరించరాదు. అలాగే, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్‌లలో పాల్గొనేవారంతా కఠినంగా కరోనా జాగ్రత్తలు పాటించాలి. సమాఖ్యకు చెందిన పర్యవేక్షక బృందం షూటింగ్‌ లొకేషన్లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టూడియోలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పర్యవేక్షిస్తుంది. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటారు. ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా మహారాష్ట్ర సర్కార్‌ వారాంతపు లాక్‌డౌన్‌ పెట్టినందు వల్ల ఇకపై అక్కడ షూటింగులన్నీ మిగతా రోజుల్లోనే చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios