శర్వానంద్, సిద్ధార్థ్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్స్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. అజయ్ భూపతి గత చిత్రాలతో పెరిగిన అంచనాలకు తగినట్లుగానే ఈ పోస్టర్ ఉంది. ఓ వైపు ప్రేమ, మరోవైపు యుద్ధం.. అనే అర్ధం వచ్చేలా పోస్టర్ డిజైన్ చేశారు. దీనికి ‘అపరిమితమైన ప్రేమ’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. 

మొదటి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. రెండో చిత్రం కోసం ‘మహాసముద్రం’ పేరుతో ఓ కథని సిద్ధం చేసుకున్నారు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న చిత్రమిది. యంగ్ శర్వానంద్‌ ఇందులో నటించేందుకు మొదటే పచ్చజెండా ఊపేశారు. ఆ తర్వాత  రెండో హీరోగా సిద్ధార్థ్‌ సీన్ లోకి వచ్చారు. సిద్ధార్థ్‌ తెలుగులో సినిమా చేయక చాలా రోజులైంది. 

అజయ్‌ ఈ సినిమా గురించి చెబుతూ ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తరహాలోనే సాగే ఓ విభిన్న కథాంశంతో రూపొందుతోంది. వైజాగ్‌ నేపథ్యంగా సాగుతుంది. నాకు తెలిసి ఇదే నా తొలి, చివరి మల్టీస్టారర్‌. ఎందుకంటే ఇలాంటి కథ రాయడం ఒకెత్తైతే.. దాన్ని ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించడం మరొకెత్తు’’ అన్నారు.