తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్‌  పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై  ధర్మాసనం  రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.  రజినీకాంత్ కు చెందిన ‘రాఘవేంద్ర కళ్యాణ మండపం’ఫై అన్నాడీఎంకేపార్టీ ఆస్తి పన్ను వేసిన వ్యవహారం రాజకీయంగా వేడి పెంచింది. 6.50 లక్షల రూపాయల ఆస్తి పన్నును చెల్లించాలంటూ  మున్సిపల్ అధికారులు రజినీకాంత్ కు నోటీసులు పంపించారు. దీనిని వ్యతిరేకిస్తూ రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

 అయితే కరోనా కారణంగా మార్చిలో విధించిన లాక్‌డౌన్ నాటినుంచి రాఘవేంద్ర కల్యాణ మండపం మూసివేసి ఉందని, అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని.. ఈ మిషయంపై సెప్టెంబర్ 23న కార్పొరేషన్‌కు రజనీకాంత్ నోటీసు పంపారని రజినీ తరపు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. 

 రజనీకాంత్ పిటిషన్‌పై బుధవారం మద్రాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా ధర్మాసనాన్ని ఆశ్రయించడంపై మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నును చెల్లించకుండా దానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీకాంత్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.