మంచు విష్ణు(manchu vishnu) ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను పోటీ చేయడం వెనుక కారణాలు వివరించిన ఆయన, మెగా బ్రదర్స్(Chiranjeevi) మద్దతు విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేవలం రోజుల వ్యవధిలో మా ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో పోటీదారుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇక ప్రధాన పోటీదారులుగా ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ తమ తమ ప్యానెల్స్ ని ప్రకటించారు. మద్దతుదారులతో ఓట్ల కోసం ప్రచారం కూడా మొదలుపెట్టారు. హోటల్స్ లో, ప్రముఖుల నివాసాలలో పార్టీలు, శిబిరాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రకాష్ రాజ్ వర్గం, ఇటు మంచు విష్ణు వర్గం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండు వర్గాలు విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను పోటీ చేయడం వెనుక కారణాలు వివరించిన ఆయన, మెగా బ్రదర్స్ మద్దతు విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారిని మీరు కలిశారా? అని రిపోర్టర్ అడుగగా.. కలవలేదు అన్నారు. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు చిరంజీవి గారి మద్దతు ప్రకాష్ రాజ్ కి అని ఓపెన్ గా చెప్పారు. అందుకే నేను చిరంజీవి గారిని కలవలేదు అన్నారు. అయితే చిరంజీవి ప్రత్యక్షంగా చెప్పలేదు కదా, నాగబాబు వ్యాఖ్యలను మొత్తం మెగా బ్రదర్స్ నిర్ణయంగా ఎలా తీసుకుంటారని రిపోర్టర్ ప్రశ్నిచడం జరిగింది. 


చిరంజీవి గారిని ఖచ్చితంగా కలుస్తాను, కాకపోతే నా మ్యానిఫెస్టో రూపొందించాక ఆయన దగ్గరకు వెళ్లి, దాని గురించి వివరిస్తా. మ్యానిఫెస్టో లోని పొందుపరచిన నా ప్రణాళిక చూశాక, చిరంజీవి గారు తన ఓటు ఖచ్చితంగా నాకే వేస్తారని అన్నారు. ఇక ఇండస్ట్రీ పెద్దలను కాపాడుకోవడం, కార్మికులకు పని కల్పించడం, వెల్ఫేర్ తన ప్రణాళికలో ప్రధాన అంశాలని మంచు విష్ణు అన్నారు. 


గెలిస్తే సొంత డబ్బులతో మా బిల్డింగ్ ఖచ్చితంగా నిర్మిస్తాను. నిర్మాతగా నష్టపోయి ఉన్నాను. అందుకే అప్పు తీసుకొని మా బిల్డింగ్ నిర్మిస్తానని మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఇక పరిశ్రమ పెద్దలు ఏకాభిప్రాయంతో ఎన్నికల నుండి నిష్క్రమించమంటే ఖచ్చితంగా తప్పుకుంటానని, ప్రకాష్ రాజ్ కంటే మెరుగైన ప్రణాళిక నా దగ్గర ఉంది, ఆయన కంటే బాగా చేయగలను అనే నమ్మకంతోనే ఎన్నికల బరిలో నిలిచినట్లు మంచు విష్ణు తెలియజేశారు.