Asianet News TeluguAsianet News Telugu

`మా` ఎన్నికల్లో మరో ట్విస్ట్.. ప్రస్తుత కమిటీకి ఏ హక్కు లేదంటూ కృష్ణంరాజుకి లేఖ

`మా`  ప్రస్తుత కమిటీలోని కొంత మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణంరాజుకి లేఖ రాయడం దుమారాన్ని సృష్టిస్తుంది. 

maa ec members letters to krishnam raju about maa elections  arj
Author
Hyderabad, First Published Jul 28, 2021, 10:20 AM IST

`మా` ఎన్నికల వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు సొంతంగా `మా` కోసం బిల్డింగ్‌ నిర్మిస్తానని చెప్పడం, బాలకృష్ణ తన వంత సాయం అందిస్తానని చెప్పడంతోపాటు `మా`లోని అవకతవకలపై ప్రశ్నించడం హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిటీలోని కొంత మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణంరాజుకి లేఖ రాయడం మరింత దుమారాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు కృష్ణంరాజుని కోరడం చర్చనీయాంశంగా మారింది. 

`మా` ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. `మేమందరం 2019, మార్చిలో ఎన్నికయ్యాము. మా పదవీ కాలం 2021 మార్చితో ముగిసిపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి `మా` ఒక ఎన్నికైన కార్యవర్గం లేకుండానే ఉంది. తాము ఎన్నికయిన కార్యవర్గమని చెప్పుకోవటానికి ప్రస్తుత కమిటీకి ఎలాంటి నైతిక హక్కు లేదు. కావున క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, `మా`లో సీనియర్‌ సభ్యుడిగా మీరు పగ్గాలు చేపట్టండి. తక్షణమే ఎన్నికలు నిర్వహించండి` అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

`మా` ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ప్రస్తుతం 24 మంది సభ్యులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జరగనుంది. సాధారణంగా ఈ కమిటీ సమావేశానికి అధ్యక్షుడు నరేష్‌ అధ్యక్షత వహించాల్సి ఉంది. అయితే నరేష్‌ బదులుగా క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఎన్నికలు సహా కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఈసీ సభ్యులు లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖలపై అభిప్రాయం తెలపమని మా అధ్యక్షుడిని, క్రమశిక్షణా సంఘం సభ్యులను కృష్ణంరాజు కోరే అవకాశముంది. వారి అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

ప్రస్తుతం కొత్త కమిటీ కోసం `మా` అధ్యక్ష బరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు పోటీపడుతున్నారు. అయితే వీరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. జీవిత, హేమ, నర్సింహరావు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఏకగ్రీవం అంశం కూడా రేపు జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios