Maa Awara Zindagi Review : `మా అవారా జిందగీ` రివ్యూ.. బిగ్ బాస్ శ్రీహాన్ బ్యాచ్ రచ్చ చేసిందా?
బిగ్ బాస్ శ్రీహాన్ హీరోగా నటించిన ‘మా ఆవారా జిందగీ’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. యూత్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునేలా ఉందా? లేదా? అన్నది రివ్యూ తెలుసుకుందాం.
మూవీ : మా ఆవారా జిందగీ
డైరెక్టర్ : దేపా శ్రీకాంత్ రెడ్డి
నిర్మాణ సంస్థ : విభా ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : నంద్యాల మధుసూదన్ రెడ్డి
నటీనటులు : బిగ్ బాస్ శ్రీహాన్ (Srihan), ముక్కు అజయ్, ఎల్బీ, లంబు, షియాజీ షిండే, సద్దాం, ఢీ చెర్రీ, జస్వంత్, టార్జాన్, తదితరులు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ ప్రసాద్ వి, ఉరుకుంద రెడ్డి.
సంగీతం : ప్రతీక్ నాగ్
ఎడిటర్ : సాయిబాబ తలారి
బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యారు శ్రీహాన్. అంతకు ముందు యూట్యూబ్ స్టార్‌గా, మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హన్ముంతు బాయ్ ఫ్రెండ్‌గా మరింత పాపులర్. ఆయన నటుడిగానూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీహాన్ మెయిన్ లీడ్‌గా తెరకెక్కిన చిత్రం `మా ఆవారా జిందగీ`. దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నంద్యాల మధుసూధన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నేడు శుక్రవారం (జూన్ 23)న థియేటర్లో రిలీజ్ అయ్యింది. మరి శ్రీహాన్ బ్యాచ్ కలిసి ఈ సినిమాతో రచ్చ చేశారా? సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
అతికష్టం మీద బీటెక్ పట్టా పొందిన నలుగురు కుర్రాళ్లు భట్టి (శ్రీహాన్), సీబీ (జబర్దస్త్ అజయ్), చెర్రీ(ఎల్బీ), జస్వంత్ (లంబు) ఖాళీగా తిరుగుతుంటారు. ఉద్యోగాలు రాక ఇంటాబయట సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడూ తాగుతూ ఆవారాగా తిరుగుతుంటారు. దీంతో పలుసార్లు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్తారు. అక్కడ ఎస్సైగాపనిచేసే రెడ్డి (షియాజీ షిండే) వాళ్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తుంటారు. ఈ క్రమంలో ఎస్సై కూతురు కిడ్నాప్ కు గురవుతుంది. ఇంతకీ ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? అందులో ఈ నలుగురి ప్రమేయం ఉందా? పాప సురక్షితంగా ఉందా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
యూత్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. కామెడీతోపాటు రొమాన్స్, ఎమోషనల్ ను జోడిస్తే మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాయి. ఇక ఓటీటీ వేదికల్లో అయితే అడల్ట్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు, సిరీస్ లకు రెస్పాన్స్ బాగొస్తున్న విషయం తెలిసిందే. ఇక ‘మా ఆవారా జిందగీ’ సినిమా కూడా అదే జోనర్ లోకి వస్తుందని అనిపిస్తుంది. సినిమా విషయానికొస్తే.. ప్రథమార్థం మొత్తం నలుగురు కుర్రాళ్ల చుట్టే తిరుగుతూ ఉంటుంది. వారు చేసే అల్లరి, చిల్లర పనులను చూపించారు. తినడం, తాగడం, తిరగడంతో కాస్తా ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత చిత్రం అసలు కథ ప్రారంభం అవుతుంది.
ఎస్సై రెడ్డి కూతురు కిడ్నాప్ తర్వాత నుంచి కథలో కాస్తా సీరియస్ నెస్ వస్తుంది. అడల్ట్ సీన్స్, పలు ఆసక్తి కరమైన సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆఖరిలో వచ్చే ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక చిత్రంలోని క్లైమాక్స్ ను కూడా దర్శకుడు రెగ్యులర్ సినిమాలా లాగా కాకుండా కాస్తా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అలాగే ఛేజింగ్ సీన్స్ కూడా ఆడియెన్స్ కు ఆకట్టుకునేలా ఉంటాయి. కొన్ని సీన్లు మినహా పర్లేదనే ఫీల్ కలుగుతుంది. ప్రథమార్థం సరదాగా సాగిపోగా.. ద్వితీయార్థం కాస్తా సిరీయస్ గా సాగుతుంది. ఇంట్రెస్టింగ్ అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్‌గా ఇది మంచి టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు. యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా సాగుతుంది.
నటీనటులు :
చిల్లర బ్యాచ్ గా శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్ లు సరిగ్గా సరిపోయారు. తమ పాత్రలకు న్యాయం చేశారు. వారి నటనలో సహజత్వం కనిపించింది. నలుగురూ కామెడీ సీన్లను బాగా పెర్ఫామ్ చేశారు. క్యాజువల్ గానే కనిపిస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సినిమాకు వీరి కామెడీనే హైలెట్ అనొచ్చు. ఇక షియాజీ షిండే పాత్ర కూడా బాగా కుదిరింది. ఎప్పటిలాగే తనదైన పెర్ఫామెన్స్ తో అలరించారు. కానీ ఆయనకు డబ్బింగ్ చెప్పిన వాయిస్ సూట్ అవ్వలేదని అనిపించింది. మిగిలిన పాత్రలు ఆ పరిధిలో ఆకట్టుకుంటాయి.
టెక్నీకల్ :
చిత్రానికి టెక్నీకల్ టీమ్ ఎంత బలంగా ఉంటే.. ఆ సినిమా అవుట్ పుట్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఈ విషయంలో మాత్రం యూనిట్ కాస్తా సక్సెస్ కాలేకపోయిందనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ పెద్దగా ఆకట్టుకునేలా ఉండనే భావన కలుగుతుంది. చిత్రానికి మ్యూజిక్ కాస్తా ప్రాణంగా మారింది. పాటలు కూడా కాస్తా వినసొంపుగా.. సందర్భానుసారంగా సాగాయి. చిత్రంలోని కొన్ని బూతు డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ఎడిటింగ్ విషయం లో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి.
ఫైనల్‌గాః టైమ్ పాస్ మూవీ.
రేటింగ్‌ః 2.75