మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ , శంకర్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందుతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వెలుబడ్డ సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోన్న ఈ మూవీ అప్‌డేట్స్‌‌ గురించి రోజుకో అప్ డేట్ చొప్పున వస్తోంది. దాంతో ఈ క్రమంలో  ఈ సినిమా అంతటా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నటించే హీరోయిన్‌ నుంచి సినిమా కాన్సెప్ట్‌ వరకు రకరకాల వార్తలు పుట్టుకొతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా విషయమై లైకా ప్రొడక్షన్ కోర్టుకు వెళ్లిందనే విషయం మెగాభిమానులను కంగారుపెడుతోంది. 

వివరాల్లోకి వెళితే... దర్శకుడు  శంకర్‌ ఇప్పటికే కమల్‌ హాసన్‌తో ‘ఇండియన్ 2’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాతికేళ్ల ఏళ్ల క్రితం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన భారతీయుడు సీక్వెల్‌గా శంకర్‌ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరగడం, ఈ ప్రమాదంలో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహరం కోర్టు దాకా వెళ్లింది. దీంతో ఈ మూవీ మేకర్స్‌ నష్టపరిహారాలు చెల్లించడం కూడా జరిగింది. ఆ షాక్‌లో ఉండిపోయిన డైరెక్టర్‌ మళ్లీ ఈ మూవీ రీ-షెడ్యూల్‌కు ప్లాన్‌ చేయడం లేదు. ఇందులో హీరోయిన్ గా చేస్తున్న కాజల్‌ అగర్వాల్‌ సైతం ఈ మూవీ నుంచి తనకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇక ‘ఇండియా 2’ షూటింగ్‌ కొనసాగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో ‘ఇండియన్ 2’ను పక్కన పెట్టి శంకర్‌‌ చరణ్‌ మూవీ ప్లాన్‌ చేస్తుండటంతో లైకా ప్రొడక్షన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినట్లు తమిళ మీడియా వర్గాల సమాచారం. తాము కేటాయించిన 230 కోట్ల రూపాయల బడ్జెట్‌లో ఇప్పటి వరకు రూ. 180 కోట్లు ఖర్చు పెట్టించిన డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను పూర్తి చేయకుండానే వేరే కొత్త ప్రాజెక్ట్‌కు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహరం కాస్తా ముదిరెలా కనిపిస్తోంది. యాక్సిడెంట్‌ తర్వాత శంకర్‌ ‘ఇండియా 2’ గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాకపోవడం, హీరో కమల్‌ హాసన్‌ ఏమో రాజకీయాల్లో బిజీ అయిపోవడం ఇదంత చూస్తుంటే శంకర్‌ ఇబ్బందుల్లో పడేసేలా ఉంది.