బాలీవుడ్ లెజెండరీ నటుడు శశికపూర్ మరణం అమితాబ్ తో కలిసి పలు చిత్రాల్లో నటించిన శశికపూర్ వీటిలో దీవార్ సినిమాలోని మేరేపాస్ మా హై డైలాగ్ ఎవర్ గ్రీన్
బాలీవుడ్ లెజెండరీ హీరో శశికపూర్ మరణం బాలీవుడ్ కు తీరని లోటు. అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్య, కరీనా, సైఫ్, రాణి ముఖర్జీ, రణబీర్ కపూర్, కాజోల్ తదితరులు శశికపూర్ మృతదేహాన్ని సందర్శించిన వారిలో వున్నారు. ఇక శశికపూర్ బాలీవుడ్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లున్నా తాను పలికిన ఎవర్‌గ్రీన్ డైలాగ్ ‘మేరే పాస్ మా హై’ కు మాత్రం విశిష్ట వుంది. అమితాబ్ బచ్చన్-శశికపూర్ సోదరులుగా పలు చిత్రాల్లో నటించగా.. వాటిలో ‘దీవార్’ చిత్రం చాలా ప్రత్యేకమైనది. అందులో శశికపూర్ పలికిన ఈ డైలాగ్ ఇంకా ప్రత్యేకమైంది. యశ్‌చోప్రా దర్శకత్వంలో 1975లో వచ్చిన ‘దీవార్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సలీమ్-జావెద్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
ఇందులో విజయ్, రవి పాత్రలను అమితాబ్, శశికపూర్‌లు పోషించారు. ఇద్దరూ భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు. విజయ్(అమితాబ్) డాన్‌గా ఎదుగుతాడు. అదే సమయంలో రవి(శశికపూర్) నిజాయతీ కలిగిన పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఓ సన్నివేశంలో వీరిద్దరూ ఎదురు పడినప్పుడు నా వద్ద మేడలు.. ఆస్తిపాస్తులు.. బ్యాంక్ బ్యాలెన్స్.. బంగ్లాలు.. కార్లు ఉన్నాయి.. నీ వద్ద ఏమున్నాయి? అంటూ విజయ్(అమితాబ్) ప్రశ్నించగా, పోలీస్ ఆఫీసర్ అయిన రవి(శశికపూర్) ‘నా వద్ద అమ్మ ఉంది’( మేరే పాస్ మా హై) అంటూ చెప్పిన డైలాగ్‌కు థియేటర్లు చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయాయి.
‘దీవార్’ విడుదలై దాదాపు 40ఏళ్లు పూర్తయినా, ఈ డైలాగ్‌కు క్రేజ్ తగ్గలేదు. ఈ డైలాగ్‌తో చాలా పేరడీలు కూడా వచ్చాయి. ‘దీవార్’ చిత్రం అనేక భాషల్లో రిమేక్ కూడా అయింది. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘మగాడు’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. తప్పనిసరిగా చూడాల్సిన టాప్ 25 బాలీవుడ్ చిత్రాల్లో ‘దీవార్’ ఒకటి. 23వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ చిత్రం ఏడు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా శశికపూర్ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే తనది సహాయ నటుడి పాత్ర కాదని, కథానాయకుడితో సమానమైన పాత్రని అవార్డును తిరస్కరించారు శశికపూర్.
