సినీ పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రముఖ లెజెండరీ సింగర్ ఈ ఉదయం కన్నుమూయడం బాధాకరం. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం మమతా బెనర్జీ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది సౌత్, నార్త్ లోని దిగ్గజాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సంబురం పోకముందే.. ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ సింగర్ సుమిత్రా సేన్ (89) (Sumitra Sen) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె మృతి చెందడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Benerjee) సంతాపం తెలిపారు.
ప్రముఖ గాయని సుమిత్రా సేన్ మంగళవారం కోల్‌కతాలోని తన స్వగృహంలో కన్నుమూశారు. సేన్ చాలా కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. బ్రోకో న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె డిసెంబర్ 21న ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మళ్లీ డిసెంబర్ 31న అనారోగ్యంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సారి ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయమం కన్నుమూసినట్టు గాయని కుమార్తె శ్రబానీ సేన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ... ‘అమ్మ ఈ ఉదయం మమ్మల్ని విడిచిపెట్టింది’ అంటూ భావోద్వేగం అయ్యారు.
సుమిత్రా సేన్ కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శ్రావణి మరియు ఇంద్రాణి ఇద్దరూ కూడా రవీంద్ర సంగీత్‌లో ప్రసిద్ధ గాయకులే. దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమిత్రా సేన్ ఆకస్మిక మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను 2012లో సంగీత మహాసమ్మన్‌తో సత్కరించింది. ఇక గతేడాది దిగ్గజ సింగర్, నైట్ ఏంగెల్ ఆఫ్ బాలీవుడ్ లతా మంగేష్కర్, బప్పీ లహరినీ కోల్పోయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనూ దిగ్గజ నటులు క్రిష్ణం రాజు, సూపర్ స్టార్ క్రిష్ణ, కైకాల సత్యనారాయణ, రీసెంట్ గా చలపతి రావు తుదిశ్వాస విడిచారు.
